బాబు ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తున్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడు అని, తిరుగులేని ముఖ్యమంత్రి అని 2050 విజన్ అంటూ తెగ పొగిడిన వారే పదవి అధికారం పోగానే ముఖం చాటేస్తున్నారు. రాజకీయం ఎంతటి కర్కశ‌మో చంద్రబాబు వంటి తలపండిన వారికి అర్ధం కాదనుకోలేం. కానీ కఠిన‌మైన విషయాలను, చేదు నిజాలను జీర్ణించుకోవడం చాలా కష్టమన్నది మాత్రం బాబుకు కూడా  ఇపుడే అనుభవంలోకి వస్తోంది.


ఇదిలా ఉండగా చంద్రబాబు విశాఖ జిల్లా టూర్ ఇపుడు పెట్టుకున్నారు. ఆయన పార్టీని గాడిలో పెట్టేందుకు జిల్లా టూర్లను ప్రారభించిన సంగతి తెలిసిందే. మొదట తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లిన చంద్రబాబు ఇపుడు విశాఖలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ నెల 10, 11 తేదీలలో చంద్రబాబు విశాఖ టూర్ ఉంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. చంద్రబాబు తన పర్యటన సందర్భంగా మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ఏకబిగిన ఈ కార్యక్రమం సాగనుంది.


అదే విధంగా తొలి రోజు పార్టీ విస్త్రుతస్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబు విశాఖలో పార్టీ స్థితి గురించి స్వయంగా గమనించడమే కాదు దానికి తగిన విధంగా రిపేర్లు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు ఇక బాబు సమీక్షకు వచ్చే నాయకులు ఎందరు, రాని వారు ఎందరు అన్న చర్చ ఇపుడు టీడీపీలో హాట్ హాట్ గా సాగుతోంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడంలేదు. ఆయన ఓ విధంగా పార్టీకి దూరం అవుతున్నారని అంటున్నారు.



మరో వైపు విశాఖ సౌత్ ఎమ్మెల్యే కూడా పార్టీ కార్యక్రమాలకు సరిగ్గా రావడంలేదు. పార్టీ విశాఖ జిల్లా ఇన్చార్జి నిమ్మకాయల చినరాజప్ప వచ్చి అందరినీ పిలిచారు.  ఈ ఇద్దరూ హాజరుకాకపోవడంతో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ ఇద్దరూ పార్టీలో ఉంటారా ఉండరా, చంద్రబాబు వచ్చినా హాజరవుతారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరి చంద్రబాబు వచ్చాక కూడా వీరు రాకపోతే అది రాష్త్ర రాజకీయాల్లోనూ కీలకమైన అంశం అవుతుంది.


అలాగే మీడియాకు కూడా పెను సంచలమైన వార్త అవుతుంది. టీడీపీలో ప్రకంపనలు కూడా పుట్టిస్తుంది. అటువంటి స్థితి రాకుండా టీడీపీ ఏమైనా జాగ్రత్తలు తీసుకుందా లేదా అన్నది ఇపుడు చర్చగా ఉంది. చూడాలి.  చంద్రబాబు విశాఖ టూర్ ఎలాంటి రాజకీయ సంచలనాలు పార్టీలో తీసుకువస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: