ఆర్టీసీ కార్మికులు ఉద్యమాన్ని తీవ్రం చేస్తుండటంతో  ప్రభుత్వం ఎదురుదాడి మొదలుపెట్టింది. విపక్షాల మద్దతు కూడగట్టి యూనియన్ లు రౌండ్ టేబుల్ కు ప్లాన్ చేయగా - తప్పు ఒప్పుకుని కార్మికులు సరెండర్ కావాలని పిలుపు నిచ్చింది. 


ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకుండా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని తెలంగాణ సర్కారు ప్రకటించింది. కార్మికులకు మద్దతిస్తున్న ప్రతిపక్షాల్ని టార్గెట్ చేస్తోంది. కార్మికుల ఉద్యోగాలు పోవడంతో పాటు యూనియన్లు కూడా గుర్తింపు కోల్పోయాయని ప్రకటించి ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసింది. పండుగరోజు ఆందోళనకు విరామం ఇచ్చిన యూనియన్లు విపక్షాల మద్దతుతో రౌండ్ టేబుల్ నిర్వహించాలని భావిస్తోంది. హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక ముంగిట్లో వచ్చిన ఈ సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది.


ఆర్టీసీ విలీనంపై మాట్లాడుతున్న కాంగ్రెస్, బిజేపీలు.. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏం చేశారో చెప్పాలని సర్కారు ప్రశ్నిస్తోంది. కార్మికులు యూనియన్ నేతల్ని నిలదీయాలంటున్న ప్రభుత్వం.. మెడపై కత్తి పెట్టి డిమాండ్లు నెరవేర్చుకోవాలనుకోవడం అవివేకమని చెబుతోంది. కార్మిక సంఘాలతో ఇక చర్చల్లేవని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే.. కార్మికులు సరెండర్ కావాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరి వల్లే ఆర్టీసీకి ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు ఇప్పటిదాకా సెప్టెంబర్ జీతం కూడా రాలేదు. ప్రభుత్వ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోని కార్మికులు విధులకు రావడం లేదు.  ఆఖిలపక్ష సమావేశం తర్వాత డిపోల దగ్గర ఆందోళనకు కార్మికులు రెడీ అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు అస్సలు పట్టించుకోవడం లేదు. తమ పంతం ఎలాగైనా నెగ్గించుకోవాలంటూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. కార్మికుల ఉద్యమానికి ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ప్రయాణీకులు మాత్రం బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: