చంద్రబాబునాయుడులో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతోంది. అసలే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబు కుదేలైపోయారు. దాని ప్రభావంతోనే చాలామంది నేతలు పార్టీకి రాజీనామాలు చేసేశారు. కొందరు నేతలు వైసిపిలో చేరితే చాలామంది బిజెపిలో సర్దుకున్నారు.

 

తాజాగా టిడిపికి రాజీనామా చేసిన జూపూడి ప్రభాకర్, ఆకుల సత్యనారాయణ కూడా వైసిపిలో చేరారు. సరే పార్టీలు మారే నేతల విషయాన్ని పక్కనపెట్టినా తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలోనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోందట.

 

మొన్నటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ తరపున స్ధానిక ఎన్నికల్లో పోటి చేయటానికి గట్టి నేతలెవరూ ముందుకు రావటం లేదని సమాచారం. ఎందుకంటే స్ధానిక ఎన్నికల్లో గెలిచినా ప్రభుత్వం వైసిపిది కాబట్టి గెలిచిన వాళ్ళు పెద్దగా చేయటానికి ఏమీ ఉండదన్నది టిడిపి నేతల భావనగా కనబడుతోంది.

 

నిజానికి సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ నాలుగు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇమేజి మరింత పెరిగిందన్నది వాస్తవం. జగన్ ఇమేజి పెరగటానికి ప్రధాన కారణం ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో బిజీగా ఉండటమే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హామీలను ఎలా నెరవేర్చాలా అన్న విషయం మీదే జగన్ ఫోకస్ పెట్టారు.

 

నాలుగు నెలల్లోనే కొన్ని హామీలను అమలు చేసిన జగన్ మరి కొన్ని పథకాలను గ్రౌండ్ చేయటానికి టైం టేబుల్ కూడా ప్రకటించేశారు. టైం టేబుల్ ప్రకటించేశారు కాబట్టి కాస్త అటు ఇటు అయినా కచ్చితంగా హామీలను అమల్లోకి తేవాల్సిందే. ఇచ్చిన హామీలను వెంటనే  అమలు చేయటమన్నది గడచిన ప్రభుత్వాల్లో జనాలు చూడలేదు.

 

పైగా నాలుగు మాసాల జగన్ పాలనను ఐదేళ్ళ చంద్రబాబునాయుడు పాలనతో పోల్చి చూసుకుంటున్నారు జనాలు. దాంతో చంద్రబాబుకు జగన్ కు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అందుకనే ప్రతిపక్షంలో ఉన్నప్పటి కన్నా సిఎం అయిన తర్వాతే జగన్ పై జనాల్లో ఇమేజి మరింత పెరిగింది. ఈ కారణం వల్లే వైసిపిని ఎదుర్కోవటం కష్టమన్న ఉద్దేశ్యంతో టిడిపి తరపున గట్టి నేతలు దొరకటం కష్టమన్న విషయంలోనే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: