ముఖ్యమంత్రి జగన్ మరో మారు వరాల జల్లు కురిపించారు. ఆయన ఈ రోజు అనంతపురంలో వైఎస్సార్ కంటి వెలుగు పేరిట బ్రుహత్తర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలకు మరిన్ని వరాలు అందించారు. తన పాలనల్లో విద్య, వైద్యం,  వ్యవసాయానికి  అధిక ప్రాధాన్యత ఇస్తానని జగన్ ప్రకటించారు. ఆరోగ్యవంతమైన నవ్యాంధ్ర  తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


పక్షపాతం, తలసేమియా వ్యాధులతో బాధపడే వారికి నెలకు అయిదు వేల రూపాయల వంతున పెన్షన్ ఇస్తామని జగన్ వరాలు కురిపించారు. అంతే కాకుండా కిడ్నీ రోగులకు ముందే చెప్పినట్లుగా నెలకు పదివేల రూపాయలు  పెన్షన్ ఇస్తున్నామని ఆయన అన్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో ఉపాధి కోల్పోయి డాక్టర్ల సలహాపై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రోగులకు కూడా ప్రతీ నెలా ఆర్ధిక సాయం చేస్తామని జగన్ ప్రకటించారు.


ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా రెండు వేల పై చిలుకు వ్యాధులకు ఉచితంగా చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చరు. అదే విధంగా బెంగుళూరు, చెన్నై, హైదరాబద్ వంటి మహా నగరాలలో కూడా ఆరోగ్యశ్రీ కార్డు చూపించి వైద్యం తీసుకోవచ్చునని దానికి డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుందని జగన్ వెల్లడించారు. మూలన పడి ఉన్న 104, 108 వాహనాలను మార్చి 1 నుంచి పనిచేసేలా చేస్తామని కూడా హామీ ఇచ్చారు.


వేయి రూపాయలు మించితే చాలు ఆరోగ్రశ్రీ వర్తించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కంటి వెలుగు ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్నది ప్రభుత్వ విధానం అని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం ఆరోగ్యమే మహాభాగ్యం అంటోందని, అందువల్ల దీనికి ఎంత ఖర్చు అయినా కూడా భరిస్తామని జగన్ స్పష్టం  చేశారు. తాను అనంతపురానికి మనవడినని జగన్ చెప్పుకున్నారు. తన తల్లి విజయమ్మ అనంతపురం జిల్లా ఆడపడుచు అని జగన్ సభలో చెప్పినపుడు హర్షద్వానాలు మిన్నంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: