నెల్లూరు నగరంలో విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని.. డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోంది. అడ్డూ అదుపు లేకుండా స్టూడెంట్స్‌ను మత్తులో ముంచెస్తోంది. దీనిపై పోలీసుల నిఘా పెరగడంతో మాఫియా గుట్టు రట్టు అయ్యింది. నిందితులను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు అన్ని కాలేజీల దగ్గర నిఘా ఏర్పాటు చేశారు. 


నెల్లూరు నగరంలో గంజాయి ముఠా పోలీసులకు సవాల్‌ విసురుతోంది. ఎన్నికల సమయంలో ఇక్కడ వాహనాల తనిఖీల్లో దొరికిన గంజాయే ఇందుకు సాక్ష్యం. తాజాగా కొత్త రకం మత్తు మందుల ముఠా బరితెగిస్తోంది. విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుంటోంది. దీనికి వారు ఆన్‌లైన్ ద్వారా తమ కస్టమర్లను గుర్తిస్తున్నారు. పాత కస్టమర్ల ద్వారా మరి కొంతమంది కస్టమర్లను తయారు చేసుకుంటున్నారు. వీరంతా విద్యార్థులే. అది కూడా ప్రొఫెషనల్‌ కోర్సులకు సంబంధించిన వారే కావడమే మరింత ఆందోళన కలిగించే అంశం. 


నెల్లూరుకు చెందిన సాదిక్.. నగరంలోని ఓ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌ కోర్సులో థర్డ్‌ ఈయర్‌ చదువుతున్నాడు. మొదట్లో గంజాయికి అలవాటు పడ్డ ఇతను.. తర్వాత మరింత మత్తు కోరుకున్నాడు. దీంతో డార్క్ వెబ్‌సైట్స్‌ను బ్రౌజ్ చేయడం  మొదలు పెట్టాడు. ముందుగా చెన్నైలో జరిగే రేవ్ పార్టీల వివరాలు తెలుసుకుని.. అక్కడికి వెళ్లాడు. అక్కడ అతనికి లక్ష్మీనారాయణ అనే మత్తు మందుల డీలర్ పరిచమయ్యాడు. లక్ష్మీనారాయణ సాదిక్‌ని పావుగా వాడుకుని.. నెల్లూరు నగరంలో తమ దందాను విస్తరణకు ప్లాన్‌ చేశాడు. ముందుగా సాదిక్‌ డ్రగ్స్‌కు అడిక్ట్ అయిన తర్వాత.. వ్యాపార భాగస్వామిని చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను చెడిపోవడమే కాకుండా మరికొంతమంది విద్యార్థులను మత్తు మందులకు బానిస చేశాడు సాదిక్‌. 


లక్ష్మీనారాయణ.. తన టీమ్‌తో కలిసి.. అప్ఘాన్ నుంచి సరుకు తెప్పించి.. అన్‌లైన్ ద్వారా కోకైన్, ఎల్ఎస్‌డి, ఎండిఎంఎల్ మత్తు మందులను సరఫరా చేయడం మొదలు పెట్టారు. ఇలా నెల్లూరు, తిరుపతిలో పెద్ద సంఖ్యలో కస్టమర్లను తయారు చేసుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో డి.ఎస్.పి రాఘవరెడ్డి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. వీరు గత రెండు నెలలుగా కాలేజీల వద్ద నిఘా పెట్టారు. సాదిక్ ద్వారా సరుకు నెల్లూరు నగరంలోకి వస్తోందని తెలుసుకుని.. ముందుగా అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణతో పాటుగా అతని టీమ్‌ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి కొకైన్, ఎల్ఎస్‌డి, ఎండిఎంఎల్‌లను స్వాధీనం చేసుకున్నారు. 


ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు మార్కుల ఒత్తిడితో కొందరు విద్యార్థులు మానసికంగా.. బలహీనంగా తయారై..డ్రగ్స్‌కు ఈజీగా అలవాటు పడుతున్నారు. మరికొందరు ఇంట్లో నియంత్రణ లేక ఎంజాయ్‌ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.మత్తు వ్యాపారం రోజురోజుకీ విస్తరిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీల్లో చదివే పిల్లలు ఎలా చదువుతున్నారు. వాళ్లలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: