తెలంగాణలో యూరియా కొరత కాక రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతోనే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. యూరియా కొరత ఎందుకు వచ్చిందో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. మరోవైపు అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. ఎంతటి వ్యక్తి అయినా సరే వదిలేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


ఎరువుల అమ్మకాలు ఆన్‌లైన్‌లో నమోదైన క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. లోతైన విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేంద్రం సీరియస్‌గా ఫోకస్‌ చేసింది. లక్షల టన్నుల యూరియా ఇచ్చినా కొరత ఎందుకో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతీ జిల్లాలో ఎందరు రైతులకు యూరియా అమ్మారు..? వారిలో ఎక్కువ బస్తాలు కొన్న తొలి ముగ్గురు పేర్లు, వారు ఎంత కొన్నారు..? వారికి ఉన్న భూమి ఎంత..? అందులో ఏం పంట సాగు చేశారు..? కొన్న యూరియాను నిజంగా ఆ పంటలకే వినియోగించారా..? అనే కోణంలో విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం  ఆదేశించింది. 


తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరతకు టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. వ్యాపారులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నేతలు కుమ్మక్కై యూరియాను బ్లాక్ చేసి, కృత్రిమ కొరత సృష్టించారని విమర్శిస్తోంది. యారియా కొరతకు కారణాలు అన్వేషించాలని కేంద్రం కోరినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వాస్తవాలేంటో గుర్తించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని అంటోంది. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని దుయ్యబట్టింది. యూరియా కొరతపై సమగ్ర విచారణ చేపట్టి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది బీజేపీ. 


యూరియా పంపిణీలో అక్రమాలు జరిగాయన్న వార్తలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. యూరియా పంపిణీలో అక్రమార్కులను సహించబోమన్నారు. పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ఆన్ లైన్ విధానం అమలు చేస్తున్నా అక్రమాలు జరిగాయన్న వార్తలపై సీరియస్ అయ్యారు మంత్రి. అవినీతి, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్షాలకు తూట్లు పొడిచే వారిపట్ల కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: