మ‌తం ముసుగులో....మ‌నుషుల స్వేచ్ఛను, ఆకాంక్ష‌ల‌ను, ఆలోచ‌న‌ల‌ను తుడిచివేసేవారికి ఊహించ‌ని షాక్‌ల‌ను ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఎంపీ నుస్రత్ జహాన్ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్న నాటి నుంచి ఇటు ముస్లిం అటు హిందూ మ‌త పెద్ద‌లు కొంద‌రు ఆమెపై ష‌ర‌తుల ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటూ ముందుకు సాగుతున్న నుస్ర‌త్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఆ దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాలను గౌరవిస్తానని, ప్రత్యేకంగా పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని నుస్రత్ తేల్చిచెప్పారు.


దేవీ నవరాత్రులు జరిపిన తర్వాత అక్కడి హిందూ మహిళలు తమ సంప్రదాయంలో భాగంగా నొసట కుంకుమ ధరించి సింధూర్ ఖేలా ను నిర్వహించడం ఆనవాయితీ. దుర్గా దేవి కాలికి ఉన్న కుంకుమను నుదట ధరించి, ఆమ్మవారికి మిఠాయిలను నైవేద్యంగా పెడతారు. తమ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మహిళలు ఒకరికొకరు కుంకుమను ధరిస్తారు. తాజాఆ దసరా వేడుకల సందర్భంగా శుక్రవారం కలకత్తా ఛల్తాభగాన్ లోని ఓ దుర్గా పూజా మండపంలో సింధూర్ ఖేలా వేడుకలో ఆమె పాల్గొన్నారు. భర్త నిఖిల్ జైన్‌తో సహ పాల్గొన్న ఎంపీ నుస్రత్.. తాను భగవంతుడి ప్రత్యేక బిడ్డనని అన్నారు.


ముస్లిం మహిళనైన తనను, హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తనను చాలామంది పేరు మార్చుకోవాల్సిందిగా సూచించారని అన్నారు. తాను ఆ దేవుని ప్రత్యేక బిడ్డనని, అన్ని మతాలను గౌరవిస్తానని, ప్రత్యేకంగా పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని నుస్రత్ ఈ సందర్భంగా అన్నారు.మానవత్వం , ప్రేమ కంటే మరేమీ ముఖ్యమైనది కాదనే విషయాన్ని ఇప్పటికే ప్రజలకు తెలిపానని, తాను అన్ని మతాల ప్రజలను, వారి సంప్రదాయాన్ని గౌరవిస్తానని అన్నారు. కాగా, దుర్గాదేవి పూజ‌ల్లో పాల్గొన్న నుస్ర‌త్‌పై ప‌లువురు ముస్లిం పెద్ద‌లు క‌న్నెర్ర చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌తం, పేరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. అయితే, త‌న వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ ప్ర‌కారం న‌డుచుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా నుస్ర‌త్ స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: