అవును ఆ విషయాన్ని చంద్రబాబునాయుడే చెప్పారు. కాకపోతే ఆ విషయాన్ని నేరుగా కాకుండా డొంకతిరుగుడుగా చెప్పారు. విశాఖపట్నం జిల్లా రెండు రోజుల పర్యటనలో చంద్రబాబు నేతలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా మొన్నటి ఎన్నికల్లో గాజువాకలో చంద్రబాబు ప్రచారానికి రాకపోవటంపై నేతలు, కార్యకర్తల్లోని అసంతృప్తి బయటపడింది.

 

అసంతృప్తిని గమనించిన చంద్రబాబు మాట్లాడుతూ గాజువాకలో ఓ పార్టీ అధినేత బరిలో ఉన్నందున హుందాగా వ్యవహరించేందుకే అక్కడ ఎన్నికల ప్రచారానికి రాలేదని వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ అక్కడ ప్రచారం చేస్తే  రాష్ట్రవ్యాప్తంగా టిడిపిపై ప్రభావం చూపే అవకాశం ఉందని (భయం) భావించినట్లు చెప్పారు. జనసేనతో పొత్తు ఆలోచనుంటే అది బహిరంగంగానే పెట్టుకునే వాళ్ళమని కూడా చంద్రబాబు చెప్పటం విచిత్రంగా ఉంది.

 

ఇక్కడ చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే అని తేలిపోతోంది. గాజువాకలో పవన్ కల్యాణ్ పోటి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో గాజువాకలో ప్రచారానికి రామ్మంటూ స్ధానిక నేతలు ఎంత ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు పట్టించుకోలేదు. ఓ పార్టీ అధినేత బరిలో ఉన్నారు కాబట్టే హుందాగా వ్యవహరించానని చెబుతున్నారు. మరి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పోటిలో ఉన్నా ఎలా ప్రచారం చేశారు ? హుందాతనం గుర్తుకురాలేదా ?

 

అలాగే మొన్నటి ఎన్నికల్లో కాపులు టిడిపికి దూరమవుతారన్న భయం చంద్రబాబును వెంటాడింది వాస్తవం. దానికి తగ్గట్లే కాపులు టిడిపి గూబగుయ్యిమనిపించారు. కాపుల్లో మెజారిటి సెక్షన్ అసలు పవన్ నే పట్టించుకోకపోతే ఇక చంద్రబాబు లెక్కేంటి ?

 

హుందాతనం లేదు పాడూలేదు.  చంద్రబాబులో ఉన్నదంతా భయం, తెరవెనుక లాలూచీనే. ఆ విషయాలను జనాలు గ్రహించారు కాబట్టే చీ కొట్టారు. తన భయానికి చంద్రబాబు హుందాతనమనే ముసుగేసుకుంటున్నారు. గాజువాకలో చంద్రబాబు ప్రచారానికి వెళ్ళకపోవటం, మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయకపోవటాన్ని జనాలందరూ గమనించారు. ఈ ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని జనాలు గమనించారు కాబట్టే ఇద్దరికీ కలిపే తగిన బుద్ది చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: