మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న కొద్ది పార్టీ నాయకులు ఎలాగైనా గెలవాలనే ఆశతో హామీలను గుప్పిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే తమవల్ల ప్రజలకు ఏమేమి ఉపయోగాలుంటాయో వివరిస్తున్నారు. ఇక అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా... 24న ఫలితాలు రానున్నాయి. ఈ దశలో టైమ్ తక్కువగా ఉండటంతో... అధికార బీజేపీ, శివసేన వేగంగా పావులు కదుపుతున్నాయి. ఇక తాజాగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శివసేన పార్టీ శనివారంనాడు విడుదల చేసింది. 'వచన్ నామా' పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాకరే విడుదల చేశారు.


ఈ మేనిఫెస్టోలో మహిళా విద్య, యువత, విద్యుత్ టారిఫ్‌లు, వ్యవసాయ ఉత్పాదకత తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత కాలేజీ విద్య అందిస్తామని, యువ గ్రాడ్యుయేట్లకు 15 లక్షల విలువ చేసే అప్రింటిస్‌షిప్ కల్పిస్తామని, ఈడబ్ల్యూసీ లేదా సన్నకారు రైతులకు రూ.10,000 వార్షికాదాయం కల్పిస్తామని, మహారాష్ట్ర అంతటా గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకూ విద్యుత్ టారిఫ్‌ను 30 శాతం తగ్గిస్తామని శివసేన మేనిఫెస్టో వాగ్దానం చేసింది. కాగా, ఆరే ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా మేనిఫెస్టోలో శివసేన ప్రకటించ లేదు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆదిత్య థాకరే స్పందిస్తూ,


ఆరే వివాదాన్ని ప్రత్యేక ప్రాంతాల వారీ డాక్యుమెంట్‌లో ప్రస్తావిస్తామని, త్వరలోనే ఆ డాక్యుమెంట్ విడుదల చేస్తామని అన్నారు. ఇకపోతే ఈ నెల జరిగే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రాధాన్య అంశాలే అధికార బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370 రద్దు, దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్సీ), అవినీతికి వ్యతిరేకంగా మోదీ సర్కార్‌ చేపట్టిన అంశాలతోనే ప్రచారం సాగనుంది..


తమ రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు తోడుగా జాతీయ అంశాలే ప్రధానంగా ప్రచార బరిలోకి దిగితే భారీ మెజారిటీతో విజయం సాధించగలమని బీజేపీ విశ్వసిస్తున్నది. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో 220, 90 స్థానాలు గల హర్యానా అసెంబ్లీలో 75 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: