సోమశిల రిజర్వాయర్‌ సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతంలో యురేనియం కోసం చేపట్టిన తవ్వకాలు సంచలనంగా మారాయి.  దీనివల్ల భవిష్యత్‌లో అడవులు నాశనం కావడమే కాకుండా... సోమశిల రిజర్వాయర్‌ కలుషిత మవుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.  


పచ్చని వాతావరణానికి ఆలవాలమైన నెల్లూరు జిల్లాలో యురేనియం కోసం  చేపట్టిన అన్వేషణ  సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.  కడప జిల్లాలోని  ఎం.తుమ్మలపల్లి,  చుట్టుపక్కల గ్రామాలు యురేనియం తవ్వకాల వల్ల అతలాకుతలం అయ్యాయని జరుగుతున్న ప్రచారం నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం, ఆత్మకూరు పరిసరాల్లోని  ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. యురేనియం ముడిసరుకును భూమిలో నుంచి తీసిన తర్వాత శుద్ధి ప్లాంట్‌లో శుభ్రం చేస్తారు. ఆపై వ్యర్థాలను బయటకు వదులుతుండటంతో ఈ ప్రాంతాలు ఎడారికన్నా దారుణంగా తయారయ్యాయని వాపోతున్నారు స్థానికులు. తాగడానికి నీరు, పంటలు పండించడానికి భూమి పనికిరాకుండా పోయి.. ఆరోగ్య సమస్యలు పీడిస్తున్నాయని ఇక్కడి వారంతా ఆందోళన చెందుతున్నారు.  


అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు అటవీ ప్రాంతంతోపాటు గ్రామంలోని సర్వే నెంబరు 601లో 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. పక్కనే ఆత్మకూరుకు చెందిన రమేష్‌ అనే రైతు పొలంలోనూ తవ్వకాలు చేశారు. యురేనియం కోసమే తవ్వకాలు చేస్తున్నారని ప్రచారం జరగడంతో డ్రిల్లింగ్‌ను అడ్డుకున్నారు స్థానికులు. మొదట్లో తాగు నీటి కోసం బోర్లు తవ్వుతున్నారని బావించారు. తర్వాత అబ్రకం కోసం అనుకున్నారు. కానీ యురేనియం కోసం జరుగుతున్న తవ్వకాలుగా  గుర్తించారు స్థానికులు. కొందరు వెళ్లి తవ్వకాలు జరుపుతున్న వారిని ప్రశ్నించగా వారు సరైన సమాధానం ఇవ్వలేదు.  పోలీసులు ఎంటరయ్యారు. తమకు తెలియకుండా ఎలా పనులు చేపడతారని రెవెన్యూ అధికారాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు ఆగిపోయాయి. అయితే వీటికి అనుమతులు మార్చి 30నే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్ర అటామిక్‌ విభాగానికి చెందిన అధికారొచ్చి జిల్లా కలెక్టర్‌తో సమావేశమైనా..  కిందిస్థాయి రెవెన్య అధికారాలు మాత్రం తమకేం తెలియదని అంటున్నారు. 


దేశంలో సగం యురేనియం నిక్షేపాలు ఒక్క ఏపీలోనే ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ గుర్తించింది. కడపలో ఎక్కువగా ఉండగా.. గుంటూరు, నెల్లూరు జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు వామపక్షాలు గ్రామాలలో తిరుగుతూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరపరాదంటూ శాసనసభ తీర్మానం చేయాలని సీపీఎం డిమాండ్‌ చేస్తోంది. 3 నెలలుగా అనంతసాగరం మండలంలోని అటవీ ప్రాంతంలో రెండుచోట్ల డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్నాయి. 2వేల అడుగుల మట్టిని తీసి గొట్టాల్లో ఉంచుతున్నారు. వేల నమూనాలు సేకరించారు. ముడిసరుకును కడప జిల్లాలోని ఎం.తుమ్మలపల్లి దగ్గరున్న శుద్ధి ప్లాంట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ మేరకు యురేనియం ఉందో ఇక్కడ పరిశీలిస్తున్నారు. రెండు జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీరు అందిస్తున్న సోమశిల రిజర్వాయర్ సమీపంలో తవ్వకాలు చేయడానికి అన్వేషణ చేయడం... ఈ ప్రాంతవాసులకు వణుకు పుట్టిస్తోంది. రెండు దశాబ్దాల క్రితమే పడమటి కంభంపాడుతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు ఒక బృందం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పుడే యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు ఆ బృందం గుర్తించిందని అంటున్నారు. మళ్లీ ఇప్పుడు కదలిక రావడంతో అంతా టెన్షన్‌ పడుతున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: