కార్మికుల ఆరోగ్యబీమా సంస్ధ ఈఎస్ఐ కుంభకోణంలో రోజు రోజుకు  కొత్త విషయాలు వెలుగు చూస్తున్న కొద్ది ఏసీబీ స్పీడు పెంచింది. ఈఎస్ఐ డైరక్టర్ దేవికారాణి అరెస్టు తర్వాత ఈ స్కామ్ లో ఉన్న పాత్రదారులు ఒక్కక్కరిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. గడిచిన నాలుగేళ్ల లో ఏడాదికి  250 కోట్ల రూపాయలు చొప్పున వేయికోట్ల రూపాయల మందులు కొనుగోలు చేసినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ భారీ కుంభ కోణంతో లింక్ ఉన్న పలువురి పై ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ప్రైవేట్ ఆసుపత్రుల పాత్ర బయటపడింది. ఈఎస్ఐ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి స్కాం చేసినట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు.


పటాన్‌చెరు, చర్లపల్లి, వనస్దలిపురం, ఆర్‌సీ.పురం డిస్పెన్సరీ మందుల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నారు. ఓమ్ని ఫార్మతోపాటు ఇద్దురు జాయింట్ డైరెక్టర్లు పద్మ, వసంత, ఫార్మసిస్ట్ రాజికలు ప్రైవేట్ ఆసుపత్రులకు, ఈఎస్ఐ మందులను దొడ్డిదారిన తరలించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అంతే కాకుండా మెడిసిన్స్ కొనుగోలు చేసి వాటిని డిస్పెన్సరీలకు పంపించి అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్లుగా చూపెట్టినట్లు విచారణలో వెల్లడయ్యింది. అక్రమంగా ఈఎస్ఐ మందులు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని ఏసీబీ భావిస్తుంది. అందుకోసం ప్రైవేట్ ఆసుపత్రుల జాబితాను కూడా ఏసీబీ సిద్దం చేసింది.


ఇంతేగాక ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్, డాక్టర్, కే. పద్మ వర్గానికి చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మహ్మద్ గౌస్‌పాషా.. ఫార్మసిస్టు ఎం రాధిక సహకారంతో హైదరాబాద్‌లోని ఐఎంఎస్ జేడీ కార్యాలయం నుంచి మందులు, మెడికల్ కిట్లు తీసుకుని ప్రైవేటు వ్యక్తులకు చేరవేసినట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన డాక్టర్ అరవింద్‌ రెడ్డికి సైతం కొన్ని మందులను చేరవేసినట్టు తెలిసింది. ఇంతేగాకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రైవేటు దవాఖానలకు అందజేసినట్టు సమాచారం.


సనత్‌నగర్‌లోని స్పెషల్ డ్రగ్ డిస్పెన్సింగ్ యూనిట్ సిబ్బందితో కలిసి రికార్డులు తారుమారు చేసిన చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మసిస్టు వీ లావణ్య  ప్రభుత్వానికి రూ.17 లక్షల మేర నష్టం కలిగించినట్టు ఆధారాలు లభించాయి. ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్టు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు తెలిపారు. కాగా, ఐఎంఎస్ కుంభకోణంలో రోజురోజుకూ పట్టుబిగిస్తున్న ఏసీబీ అధికారులు.. నిందితుల విచారణ ద్వారా సేకరించిన సమాచారంతో మరిన్ని సోదాలు జరుపుతున్నట్టు తెలిసింది.ఈ సందర్భంలో మరి కొన్ని అరెస్టులు ఐఎంఎస్ కుంభకోణంలో  ఖాయమని తెలుస్తున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి: