మనిషి ఎంత ఉన్నతంగా బ్రతికినా, చివరకు ఎక్కవలసింది పాడే. చేరవలసింది చితినే. మానవునికి ఇదే చివరి గమ్యం అని తెలుసు. అందర్ని క్షోభ పెడుతూ, కన్నీటితో వీడ్కోలు తీసుకుంటూ పంచభూతాలలో కలసి పోతాడు. ఇదే ఆఖరు మజిలీ. కాని కొన్నిచోట్ల, కొందరు చావు అంచువరకు వెళ్లి మళ్లీ బ్రతికి బట్టకడతారు. మరణించారనుకుని బందువులు, మిత్రులు వచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి. శ్మశానంలో చివరి ఘట్టం ముగించే సమయంలో చటుక్కున లేచి కూర్చుంటారు. అక్కడ వున్నవారితో పాటు ఈ విషయం తెలిసిన వారుకూడా ఆశ్చర్యపోయేలా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. 


చనిపోయాడనుకొని ఓ వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు స్మశానవాటికకు తీసుకెళ్లి, చితిని పేర్చి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్న క్రమంలో ఆ వ్యక్తి తన తలను నెమ్మదిగా అటూ, ఇటూ తిప్పడం ఆరంభించాడు. ఆ తరువాత నిద్రలోనించి లేచినట్టుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అంతే, అంతిమ సంస్కారాల తంతుకు సాయపడుతున్న వాళ్లు భయంతో పరుగులందుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. కపఖల్లా గ్రామంలో నివసిస్తున్న సిమనాచ్ మల్లిక్ (55) పశువులకాపరి. శనివారంనాడు తన గొర్రెలు, మేకల్ని దగ్గర్లోని అడవిలోకి మేతకు తీసుకెళ్లాడు. అయితే, అనారోగ్యం కారణంగా మల్లిక్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆరోజు సాయంత్రం పశువులు ఇల్లు చేరుకున్నప్పటికీ, మల్లిక్ తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.


ఆదివారం ఉదయం అడవి గుండా వెళ్తున్న కొందరు మల్లిక్ కదలకుండా పడి ఉండటాన్ని గమనించి ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే, మల్లిక్ చనిపోయాడని భావించిన అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితిపై ఉంచి దహనం చేయబోయారు. ఆ సమయంలో మల్లిక్  ఒక్కసారిగా శ్వాస తీసుకోవడాన్ని గుర్తించారు. సపర్యలు చేయడంతో ఆయన లేచి కూర్చున్నారు.


వెంటనే అతన్ని సమీప దవాఖానకు తరలించారు. నీరసంతో పాటు,  జ్వరం ఎక్కువగా ఉండటం వల్లే మల్లిక్ స్పృహ కోల్పోయాడని, చికిత్స అనంతరం అతని పరిస్థితి నిలకడగా ఉన్నదని దవాఖాన వైద్యుడు తెలిపారు. స్పృహ కోల్పోయిన తన భర్తను దవాఖానలో చూపించకుండా.. స్మశానానికి తీసుకెళ్లడంపై తాను చింతిస్తున్నట్టు మల్లిక్ భార్య సోలి కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాలవారు మల్లిక్  ను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు....

మరింత సమాచారం తెలుసుకోండి: