ఈ ప్రపంచంలో అనాధ అనే పదం ఎంతగా మానసిక వేదనకు గురిచేస్తుందో అనుభవించేవారికే తెలుస్తుంది. మనం చూస్తున్న ఈ ప్రపంచం లోనే మనకు ఎంతో మంది చిన్నారులు కనిపిస్తారు.  చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకొని,  దిక్కుతోచని  స్దితిలో ఆదరణకు దూరమై బిక్కుబిక్కు మంటూ బ్రతుకుతున్నారు. పాపం పసి వాళ్లకు ఏం తెలుసు. ఎలా బ్రతకాలో, ఇక బంధువులంటారా ఈ కాలంలో మానవత్వం ఉన్న వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ. చనిపోయింది స్వంత ఆక్క పిల్లలైనా, అన్న పిల్లలైనా వారి కడుపున పుట్టిన పిల్లలా సాకుతారనే నమ్మకం లేదు.


చిన్న వయస్సులోనే అనాధలుగా మారిన ఇలాంటి వారి మీద దేవునికి దయ ఎందుకు కలుగదో అర్ధం కాదు. ఇకపోతే జాలి లేని దేవుడు ఓ ఇంట్లో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి వారి పిల్లలను నిర్ధాక్షిణ్యంగా ఒంటరివాళ్లను చేసాడు. అత్యంత బాధాకరమైన ఈ సంఘటన కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే. జెక్కిరెడ్డిపల్లికి చెందిన ప్రేమనాథ్‌కు పదేళ్ల క్రితం కామాక్షితో వివాహమైంది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో పల్లవికి తొమ్మిదేళ్లు, సృజనకు ఏడేళ్లు, కుమారుడు చరణ్‌కు నాలుగేళ్లు. సాఫీగా సాగిపోతున్న సంసారంలో కామాక్షి (30) అనారోగ్యం బారిన పడి, చివరకు పరిస్థితి విషమించి నెల రోజుల క్రితం మృత్యువాతపడింది. 


భార్య మృతి ప్రేమనాథ్‌ను మరింత కుంగదీసింది. కేవలం పేదరికం కారణంగానే తన భార్యకు ఖరీదైన వైద్యం అందించలేక పోయానంటూ లోలోన కుమిలిపోతూ  ముగ్గురు పిల్లలను ఎలా పెంచి పెద్దచేయాలని కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం తన ఇంటిలోనే ప్రేమనాథ్‌ (36) కళ్లు తిరిగి కిందపడ్డాడు. విషయాన్ని చూసిన చిన్నారులు భయంతో కేకలు వేశారు. ‘నాన్న లే నాన్నా’ అంటూ రోదించారు. ‘నాన్నకేమైంది అక్కా’ అంటూ సృజన, చరణ్‌ అడుగుతుంటే పల్లవి నోట మాటరాలేదు. చిన్నారుల రోదనలు విన్న చుట్టుపక్కల వారు  అక్కడకు చేరకున్నారు.


పరిస్థితి గమనించి వెంటనే ప్రేమనాథ్‌ను కంబదూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికే కనిపించకుండా పోయిన తల్లి రూపాన్ని తలుచుకుంటున్న ఆ చిన్నారులు...తాజాగా నిర్జీవంగా పడి ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి ఎందుకు నాన్న ఇంకా నిద్రనుంచి  లేవడం లేదంటూ అమాయకంగా అడుగుతుంటే గ్రామస్తులు కంటతడి పెట్టడం మినహా మరేమీ చేయలేకపోయారు.  అందుకే అంటారు కాలం చిత్రమైందని ఎవ్వరిని ఎప్పుడు ఎందుకు ఇంతలా బాధిస్తుందో అసలే అర్ధం కాదు....

మరింత సమాచారం తెలుసుకోండి: