దేశ వృద్ధిరేటుపై అంచనాలు పడిపోతున్నాయి. మొన్న మూడీస్.. నిన్న ఇండియా రేటింగ్స్.. తాజాగా దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ ఎడిషన్‌లో దేశ జీడీపీ గణాంకాలు వరుసగా రెండో ఏడాది తగ్గుముఖం పట్టనున్నాయన్న సంకేతాలనివ్వడమే కాదు.. భారత జీడీపీపై పెదవి కూడా విరిచాయి..ఇకపోతే  2017 -18 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉన్న భారత వృద్ధిరేటు.. 2018-19లో 6.8 శాతానికి దిగింది. 2019-20లో మరింతగా క్షీణించి 6 శాతంగానే ఉండొచ్చని అభిప్రాయపడింది.  ఒకరకంగా ఈ విషయం  కేంద్రంలోని మోడీ సర్కార్‌కు షాకింగ్ న్యూసే . అయితే క్రమంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21)  6.9 శాతానికి, ఆపై ఆర్థిక సంవత్సరం (2021-22) 7.2 శాతానికి పెరుగగలదన్న ఆశాభావాన్ని వరల్డ్ బ్యాంక్ వ్యక్తం చేసింది..


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మాత్రం 6 శాతం దాటకపోవచ్చని అంటున్నది.. ఇకపోతే  ఆదాయ మద్దతు, పన్ను రాయితీలకు సంబంధించి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ భారతంలో డిమాండ్‌ పెరుగుతుందని, తద్వారా 2021లో వృద్ధి 6.9 శాతానికి, 2022లో 7.2 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. మరికొన్ని రోజుల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)తో కలిసి వార్షిక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్‌ 'దక్షిణాసియా ఆర్థిక పరిస్థితుల పేరిట' ఈ నివేదికను విడుదల చేసింది. భవిష్యత్తు కాలంలో ఉత్పత్తి, నిర్మాణ రంగాలు పుంజుకునే అవకాశం ఉందని, తద్వారా పారిశ్రామిక వృద్ధి రేటు 6.9 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో అంచనా వేసింది.


దీంతోపాటు వ్యవసాయ, సేవా రంగాల్లో వృద్ధి వరుసగా 2.9, 7.5 శాతాలు నమోదౌతాయని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే తొలి త్రైమాసికంలో వినిమయ శక్తి తగ్గిపోవడంతో పాటు, డిమాండ్‌ పడిపోవడంతో వృద్ధి రేటు దారుణంగా దెబ్బతింది. ఉత్పత్తి రంగాల్లో నెలకొన్న స్తబ్ధత కారణంగా పారిశ్రామిక, సేవా రంగాల వృద్ధి బలహీన పడింది. 2018-19 ఆర్థిక సంవత్సర జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు పెరిగి 2.1 శాతానికి చేరుకుందని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది. కాగా, 2017-18 లో ఈ లోటు 1.8 శాతంగా ఉంది. ఈ గణాంకాలు క్షీణిస్తున్న వాణిజ్యం సమతుల్యతకు అద్ధం పడుతున్నాయని వ్యాఖ్యానించింది.


నోట్లరద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాలు నిరుద్యోగం, దిగజారుతున్న  రైతుల ఆర్థిక పరిస్థితులకు తోడవడంతో అవి పేదల ఆర్థిక స్థితిని మరింత దిగజార్చాయని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో స్పష్టం చేసింది. అక్టోబర్‌ 4న రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటును 6.1 శాతానికి సవరించి వేసిన సంగతి తెలిసిందే. ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ సైతం వృద్ధి అంచనాను సెప్టెంబర్‌లో 7 నుంచి 6.5 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ కూడా వృద్ధి రేటను 5.8 శాతానికే పరిమితం చేయడం గమనార్హం....


మరింత సమాచారం తెలుసుకోండి: