ఢిల్లీ నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయి వైపు పరుగులు తీస్తున్నది. కాలుష్య నియంత్రణ నిమిత్తం అమల్లోకి వచ్చిన చర్యలు ఇక ప్రజలను రక్షించలేవని తేలిపోతున్నది. వచ్చేది చలికాలం కాబట్టి మామూలు రోజులకంటే శీతాకాలం ఢిల్లీలో వాయుకాలుష్యం పతాకస్థాయిలో ఉంటుంది. ఇకపోతే ఢిల్లీని ఏళ్ళతరబడి కాలుష్యం కుమ్మేస్తుంటే, శీతాకాలంలో కొన్ని తాత్కాలిక చర్యలు తప్ప మిగతాకాలమంతా దానిపై దృష్టి పెట్టకపోవడం ఆశ్చర్యకరం.


ఇక ఢిల్లీని  ప్రస్తుతం కాలుష్యం మంచు తెరలాగా నగరాన్ని కప్పేసింది. నగరంలో గాలి నాణ్యత అంతకంతకూ క్షీణించి ఆదివారం నాడు వాయు నాణ్యత సూచీ (ఎక్యూఐ) 256 మార్క్‌ని చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి (సిపిసిబి) పేర్కొంది. గాలి నాణ్యత పరంగా ఇదే అత్యంత క్షీణ దశని, ఎక్యూఐ శుక్రవారం 208 ఉండగా, అది శనివారం నాటికి 222 కి పెరిగిందని. సిపిసిబి సమాచారం.. అదీగాక నగర శివారు ప్రాంతాలైన ఫరీదాబాద్‌, గ్రేటర్‌ నోయిడా, భగ్‌పట్‌, మూర్తాల్‌లలో ఎక్యూఐ వరుసగా 290, 233, 280, 259, 245 చొప్పున నమోదైంది. హర్యానాలోని అలీపూర్‌లో 351, పానిపట్‌లో 339 కు చేరిందని తెలిపింది..


ఇదీ ఇలా ఉండగా నగరంలో మళ్లీ పెరిగిన కాలుష్యంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వస్తున్న పొగ దీనికి కారణమని వ్యాఖ్యానించారు. ప్రధానంగా హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతం నుంచి ఈ కాలుష్యం నగరంలోకి పెద్ద ఎత్తున వస్తోందని తెలిపారు. మరో రెండు రోజుల్లో ఈ కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని 'ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌' తెలిపింది. గత మూడు నెలల్లో ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరిందని ప్రకటించడం ఇదే తొలిసారి.


రుతుపవనాలు, వాయు దిశ అనుకూలించడంతో ఆగస్టు, సెప్టెంబర్‌లో గాలి నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. హర్యానా, పంజాబ్‌లో పంట వ్యర్థాల దహనాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించకపోవడంతో రైతులు ఆ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇక ఈ కాలుష్యం విషయంలో పోరు దీర్ఘకాలిక ప్రణాళికతోనే సాధ్యం అవుతుంది. కావునా కాలుష్యాన్ని ఎన్నికల అంశంగా మార్చి రాజకీయ పార్టీల మెడలు వంచడం ఒక్కటే రాజధాని ప్రజల ముందు ఉన్న మార్గం. లేదంటే భవిష్యత్తులో ఊహించని విధంగా ప్రమాద పరిస్దితులను ఈ ఢిల్లీ నగర ప్రజలు ఎదుర్కొనవలసి వస్తుందంటున్నరు పర్యావరణ వేత్తలు... 


మరింత సమాచారం తెలుసుకోండి: