తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఈ రోజుతో  ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పరిష్కారంపై సరైన హామీ ఇవ్వలేదు. అంతే కాకుండా సమ్మె పాల్గొన్న కార్మికులను  ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం... మరోవైపు గత నెల జీతాలు కూడా ఆర్టీసీ కార్మికులకు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 

 

 

 

 

 

 అయితే తాజాగా మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతో ప్రతిపక్ష పార్టీలన్నీ అధికార టీఆర్ఎస్ పై భగ్గుమంటున్నాయి. కార్మికుల విషయంలో ప్రభుత్వం తీరు సరికాదని... నిరంకుశ వైఖరిని వీడి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపక్షాలు ఉద్యమ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై  టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

 

 

 

 

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడటం  తీవ్రంగా కలిచివేసిందని  చంద్రబాబు అన్నారు. ఏదైనా ఉంటే బతికి సాధించుకోవాలి తప్ప ఆత్మహత్య చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని చంద్రబాబు తెలిపారు. జీవితం ఎంతో విలువైందని కార్మికులందరూ తమ కుటుంబాల గురించి కూడా ఆలోచించాలని సంయమనం పాటించాలని చంద్రబాబు తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు కూడా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి . సరైన అనుభవం లేని తాత్కాలిక డ్రైవర్లను  నియమించడంతో... ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు  తాత్కాలిక డ్రైవర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: