వైసీపీ ఏపీలో అధికారంలోకి రావడం బీజేపీకి అసలు ఇష్టంలేదని తేలిపోతోంది. చంద్రబాబు తమ మీద కత్తి కట్టాడని అప్పట్లో జగన్ వైపు ఉన్నట్లు నటించింది తప్ప ఏపీలో ఇలా జగన్ మొత్తానికి మొత్తం ఊడ్చేసి నోటా కంటే తక్కువ ఓట్లకు తమను పెట్టి పాతరేస్తాడని బీజేపీ కలలో కూడా అనుకోలేదు. అందుకే జగన్ సాధించిన భారీ విక్టరీ  కేంద్రంలోని బీజేపీకి కన్నెర్ర అయింది. గెలిచిన తరువాత నుంచి అత్తగారి పెత్తనంలా కేంద్రం ఇబ్బందులు పెడుతూనే ఉంది.


అక్కడికీ జగన్ పదే పదే ఢిల్లీకి వెళ్ళి పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. కానీ వారికి కావాల్సింది అది కాదు కదా, ఏపీలో రాజకీయంగా దురాక్రమణ చేయాలన్నది బీజేపీ ఆలోచన. అయితే ఆశ లావు పీక సన్నం సామెతగా బీజేపీ పరిస్థితి ఉంది. ఎక్కడైనా మోడీ కానీ ఏపీలో మాత్రం కానే కాదని ఎన్నో ఎన్నికలు నిరూపించాయి. ఆ మాటకు వస్తే దక్షిణాదిన బీజేపీకి బలం లేదు, ఎప్పటికీ విస్తరించే అవకాశాలు కూడా లేవన్నది విశ్లేషకుల మాట.


ఉన్నంతలో ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని మిత్రుత్వం నెరుపుతూ సహాయం చేస్తే ఎప్పటికైనా బీజేపీ కొంత మెరుగుపడుతుంది. కానీ ముందే చెప్పినట్లుగా దురాశ కలిగిన బీజేపీ నాయకులు మాత్రం ఏపీని ఎలాగైనా లాగేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా జగన్ని బదనాం చేస్తే ఆయన పడిపోతారని, ఆల్రెడీ పడిపోయిన చంద్రబాబుని పక్కనపెట్టేసి మొత్తం రాజ్యం చేతిలోకి తీసుకుందామన్నది బీజేపీ  పక్కా  ప్లాన్.


అందుకోసం ఇసుమంతైనా సాయం చేయకుండా కేంద్రం మోకాలడ్డుతోంది. ఎన్నికల ముందు వరకూ బాబు అవినీతి అని ఘోషించిన బీజేపీ పెద్దలు ఇపుడు మాత్రం ఫ్లేట్ ఫిరాయిస్తున్నారు. విద్యుతు కొనుగోళ్ళ ఒప్పందాలపైన జగన్ సర్కార్ సమీక్ష చేస్తానంటే కేంద్రం విద్యుత్ మంత్రి సింగ్ గారికి కోపం వస్తోంది. ఠాట్ అలా చేయడానికి వీల్లేదు అంటున్నారు. ఇక పోలవరం విషయంలో గజేంద్రసింగ్ షెకావత్ కూడా అలాగే  ఉంటున్నారు. ఆయన సైతం జగన్ విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.


జగన్ పోలవరం రివర్స్ టెండరింగ్ జరిపి సర్కార్ ఖజానాకు ఆదా చేస్తానంటే ఎందుకు ఒప్పుకోరో అర్ధం కావడం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక అమిత్ షా అయితే జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చోద్యం చూస్తున్నారని ప్రచారం ఉంది. మొత్తానికి మోడీ అపాయింట్మెంట్ జగన్ కి దొరుకుతున్నా ఆయన జగన్ మాటలు వింటున్నా కూడా ఇంతవరకూ ఏపీకి పక్కాగా ఇదీ సాయం అంటూ కేంద్రం ఇచ్చింది లేదు. మొత్తం మీద చూస్తే కేంద్రం కత్తి కట్టినట్లుగానే ఉందంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: