ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు మరింత ఉధృతమవుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్టీసీ కార్మికులు కోరుతున్నట్లుగా దానిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని అంటున్నారు. ఇక మరోవైపు టీఎస్ఆర్టీసీ కార్మికులు మాత్రం చేసి తీర్చాల్సిందే అంటూ ప్రభుత్వంపై గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే ఇకపై ఆర్టీసీ కార్మికులతో ఎటువంటి చర్చలు జరుపబోమని, అలానే సమ్మె చేస్తున్న వారి స్థానంలో ప్రైవేట్ డ్రైవర్లు మరియు కండక్టర్ల కోసం ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధం అయింది. ఇక ఈ విషయమై నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికులు చర్చలు జరపల్సిందేనని, అలానే వారి కోర్కెల పట్ల ప్రభుత్వం కూడా కొంత పునరాలోచించాలని తీర్పునివ్వడంతో, రేపు వారి మధ్య మరొక మారు చర్చలు జరగనున్నట్లు సమాచారం. 

అయితే ఇంత జరుగుతున్నప్పటికీ, గతంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యూనియన్ మజ్దూర్ సంఘం కార్యదర్శిగా పనిచేసిన హరీష్ రావు ఈ విషయమై మౌనం వహించడం పలు రకాల అనుమానాలకు తావిస్తోంది. మధ్యలో కేకే ఈ విషయమై ఆర్టీసీ కార్మికులకు మరియు ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా ప్రయత్నించినప్పటికీ అది సఫలం కాలేదు. అయితే ఒకరకంగా ఆర్టీసీ కార్మికులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్న హరీష్ రావును ఇప్పటికే రంగంలోకి దింపి ఉంటె, ఎప్పుడో ఈ సమస్య పరిష్కారమయ్యేదని, అలానే ప్రభుత్వానికి మరియు కార్మికులకు ఇద్దరికీ మధ్య సయోధ్య కూడా కుదిరేదని అంటున్నారు. 

మరి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటివరకు హరీష్ రావును ఈ విషయమై మధ్యవర్తిత్వం చేయమని ఎందుకు కోరలేదని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలానే హరీష్ రావు కూడా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఈ వ్యవహారంతో హరీష్ రావు గారికి ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు ఆర్టీసీ సంఘాల నాయకులు. ఇక రేపు ప్రభుత్వంతో జరగబోయే చర్చలు విఫలమైన పరిస్థితుల్లో, తమ సమ్మెను మరింతగా ఉధృతం చేస్తాం అంటున్నారు కూడా. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో చూడాలి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: