రాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశంపార్టీ నేతల్లో ఎవరు ఏ రోజు పార్టీకి రాజీనామా చేస్తారనే విషయం చంద్రబాబునాయుడును టెన్షన్ పెట్టేస్తోంది. ఈ నేపధ్యంలోనే బిజెపితో మళ్ళీ పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.

 

సరే చంద్రబాబుతో పొత్తుకు బిజెపి అగ్రనేతలు రెడీ అవుతారా లేదా అన్నది వేరే విషయం. ఏపి ఇన్చార్జి సునీల్ ధియోథర్ కాని లేకపోతే రాష్ట్ర నేతల్లో కొందరు టిడిపితో పొత్తును పూర్తిస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు. అంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలా ? వద్దా ? అన్న విషయం నేరుగా మోడి, అమిత్ షా లు మాత్రమే తేల్చాలి.

 

ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోని సీనియర్ నేత లక్ష్మీపతిరాజు మాట్లాడుతూ టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం లేదుగాక లేదంటు కుండబద్దలు కొట్టారు లేండి. అదే సందర్భంగా టిడిపితో పొత్తు అవకాశం లేదని అయితే చంద్రబాబు బిజెపిలో చేరుతానంటే మాత్రం తమకు అభ్యంతరం లేదన్నట్లుగా చెప్పారు.

 

టిడిపి లాంటి జాతీయపార్టీ అధినేత అందులోను మూడుసార్లు సిఎంగా చేసిన వ్యక్తి బిజెపిలో ఎలా  చేరుతారని ఎలా అనుకున్నారో ?  ఇక్కడే బిజెపి వాళ్ళకు చంద్రబాబు ఎంతగా అలుసైపోయారో అర్ధమైపోతోంది. ఇప్పటికి రెండుసార్లు బిజెపితో కటీఫ్ చెప్పిన చంద్రబాబు మళ్ళీ మూడోసారి పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబుకు లేకపోతే బిజెపి బుద్ధి ఎక్కడ పోయింది ?

 

తమను నోటికొచ్చినట్లు తిట్టి శాపనార్ధాలు పెట్టిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకూడదన్న కనీస ఇంగితం కూడా బిజెపి జాతీయ నాయకత్వానికి లేకపోయింది. అందులోను నరేంద్రమోడిని నోటికొచ్చినట్లు మాట్లాడి, అరెస్టు చేయిస్తానని బహిరంగంగానే  హెచ్చరించిన చంద్రబాబుతో ఇదే మోడి పొత్తు పెట్టుకున్నారు కదా ?  కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి పొత్తుల విషయంలో ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అవసరాలే కలుపుతాయి అందరినీ.


మరింత సమాచారం తెలుసుకోండి: