ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో నగరంలోని మెట్రో స్టేషన్లలో రద్దీ పెరిగింది. ప‌నిదినాలు, వారాంతాలు అనే తేడాలేకుండా.... ప్రయాణికులతో మెట్రో స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో బస్సులు తిరగకపోవడం, ప్రైవేటు వాహనాల్లో భారీగా చార్జీలు వసూలు చేస్తుండటంతో నగరవాసులు మెట్రోరైలుపై పెద్ద ఎత్తున ఆధారపడుతున్న స‌మ‌యంలో...ఊహించ‌ని ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎల్బీనగర్ మియాపూర్ మెట్రోలో ప్రమాదం జ‌రిగింది. మెట్రో రైల్ డోర్ మీద ఉన్న క్యాబిన్ ఊడిపోయి కింద‌ప‌డటంతో...ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు.


ఆర్టీసీ సమ్మె నేపథ్యలో మెజార్టీ సిటీజనులతో పాటు..దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 11.30 గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లోని ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్‌పేట్, మియాపూర్‌ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇలా భారీ ర‌ద్దీతో శుక్ర‌వారం సాయంత్రం మైట్రోరైలు వెళ్తుండ‌గా....ఖైర‌తాబాద్ స‌మీపంలో...డోర్‌పైనున్న క్యాబిన్‌ ఊడి ప్రయాణికులపై పడింది. దీంతో షాక్ తిన‌డం ప్ర‌యాణికుల వంతు అయింది. అదృష్ట‌వశాత్తు ఎవ‌రికీ గాయాలు త‌గ‌ల‌లేదు. కాగా, మెట్రో ప్రయాణం అత్యంత సురక్షితం అన్న అధికారుల మాటలు నమ్మేలా కనిపించడం లేదని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.ఇటీవ‌లే...అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మెట్రో రైలులో సాధారణ రోజుల్లో  రద్దీ 2.780 లక్షలకు మించదు..సెలవు రోజుల్లో రద్దీ సుమారు 3 లక్షల మేర ఉంటుంది. అయితే, ఆర్టీసీ స‌మ్మె ఫ‌లితంగా, ఇటీవల 3.75 లక్షల మందితో రికార్డు నెలకొల్పగా..గ‌త సోమవారం రద్దీ 3.80 లక్షలకు చేరుకోవడం విశేషం. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లను హైదరాబాద్‌ మెట్రో నడుపుతోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 11.30 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: