రాజధాని నిర్మాణం విషయంలో చివరకు దళితులను రెచ్చగొట్టే స్ధాయికి  తెలుగుదేశంపార్టీ దిగజారిపోయింది. తాడికొండ మాజీ ఎంఎల్ఏ తాడికొండ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దళితుల నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదనే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి దళితులకు ఏమిటి సంబంధమో మాజీ ఎంఎల్ఏనే చెప్పాలి.

 

రాజధాని కట్టాలంటే అందుకు అనేక అంశాలు సానుకూలం కావాలి. కాని చంద్రబాబునాయుడు మాత్రం కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గం కోసమే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారనే  ఆరోపణలు విస్తృతంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మాజీ ఎంఎల్ఏ ఏమో దళితుల నియోజకర్గానికి జగన్ అన్యాయం చేస్తున్నారంటూ కొత్త కార్డు ఉపయోగిస్తున్నారు.

 

రాజధానిగా  ఎంపిక చేసిన ప్రాంతానికి అన్నీ ప్రాంతాలతో రవాణా సౌకర్యాలుండాలి. అమరావతికి లేదు. ఇక అమరావతి ప్రాంతం భారీ నిర్మాణాలకు ఏమాత్రం పనికిరాదు.  ఈ విషయాన్ని చాలామంది నిపుణులే చెప్పారు. చివరకు చంద్రబాబు ఎంతో ఇష్టపడిన సింగపూర్ కన్సార్షియం కూడా స్పష్టంగా చెప్పింది. అయినా ఇక్కడే రాజధాని నిర్మించాలని చంద్రబాబు పట్టుపట్టారు.

 

ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని నిర్మాణానికి ఏ ఒక్క అంశం కూడా అమరావతిలో అనుకూలంగా లేదన్న విషయం అందరకీ తెలుసు. అయినా చంద్రబాబు ఇక్కడే నిర్మించాలని ఎందుకు పట్టుబట్టారో ముందు శ్రవన్ సమాధానం చెప్పాలి. పైగా మంగళగిరికి రాజధాని తరలించుకునిపోయేందుకు ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మంగళగిరిలో కూడా దళితులున్నారని ఆయనే చెబుతున్నారు.

 

నిజానికి రాజధాని నిర్మాణానికి మంగళగిరి ప్రాంతమే అనుకూలం. ఎందుకంటే ఇక్కడి రాకీ సాయిల్ భారీ నిర్మాణాలకు అనువుగా ఉంటుంది. దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అంటున్నారు. రాజధాని ప్రాంతంపై జగన్ ఇంత వరకూ మాట్లాడకపోయినా టిడిపి మాత్రం దళితుల కార్డు ప్రయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: