మంచుకొండల్లో మైనస్ 60 డిగ్రీల దగ్గర విహరించాలని ఉందా? సైన్యం మాత్రమే ఉండగల అత్యంత ప్రమాదకర ప్రాంతంలో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంపై సాహసమే ఊపిరిగా అడుగుపెట్టాలని ఉందా? అయితే సియాచిన్ దర్శించటానికి రెడీ అవ్వండి. కేంద్రం ఈ ప్రాంతాన్ని దర్శించే అవకాశం సామాన్య పర్యాటకులకు కూడా ఇస్తోంది. 


నిన్నటిదాకా అక్కడ సైనికులు మాత్రమే ఉండే వీలుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం.... మైనస్ 18 నుంచి 60 డిగ్రీల కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రాంతం.. కఠిన శిక్షణ పొందిన సైనికులు మాత్రమే అక్కడ ఉండగల పరిస్థితి. కానీ, ఇప్పుడు సామాన్యులకు కూడా మంచుకొండలు స్వాగతం పలుకుతున్నాయి. ఓ బ్యాక్ పాక్ వేసుకుని వచ్చేయమంటున్నాయి. 


సాహస యాత్ర చేయాలనే ఉత్సాహం ఉన్నవాళ్లకు సియాచిన్ స్వాగతం పలుకుతోంది. ఆర్మీ బేస్ వరకు టూరిస్టులు రావొచ్చని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. నిజానికి సైనికులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారో, ప్రకృతి ఎంతటి విషమ పరీక్షల్లోకి నెడుతందో సామాన్యులు ఊహించలేరు. ఇప్పుడా అవకాశం వచ్చింది. ఈ ప్రాంతానికి వెళ్లాలనుకునే యాత్రికులకు ఆర్మీ కఠిన శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. 


పర్యాటకంగా లడఖ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా భారీ సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పడు సియాచిన్ వద్దకు చూడా పర్యాటకుల్ని అనుమతించటం, ఈ ప్రాంత టూరిజానికి కొత్త ఊపు ఇచ్చే అవకాశం ఉంది. లడఖ్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్.. సముద్ర మట్టానికి 11875 నుంచి 18875 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు పాక్ కుట్రలను పసిగట్టిన భారత ఆర్మీ దాన్ని భగ్నం చేసింది. ఆపరేషన్ మేఘదూత్ అమలు చేసి, 1984 ఏప్రిల్ 13న  భారత్ సొంతం చేసుకుంది. నాటి నుంచి అక్కడ అత్యంత కఠిన వాతావరణంలోనూ మన సైనికులు పహారా కాస్తున్నారు. సియాచిన్ గ్లేసియర్. ఒకవైపు చైనా, మరోవైపు పీఓకే మధ్య ఉండే ఓ చిన్న ప్రదేశం. వ్యూహాత్మకంగా భారత సైన్యానికి అత్యంత కీలకమైనది కూడా. కార్గిల్ యుద్ధ సమయంలో సియాచిన్ గ్లేసియర్ పాత్ర చాలా ఉంది. 


అయితే ఈ ప్రాంతం ఎంత అందమైనదో..అంతే ప్రమాదకరమైనది.. ఎందుకంటే తరచూ ఇక్కడ మంచు తుఫాన్లు సంభవిస్తుంటాయి. గంటకోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. దూసుకొచ్చే అవలాంచ్ అత్యంత ప్రమాదకరం కూడా. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని పర్యాటకుల సందర్శన కోసం తెరవడం వల్ల లడఖ్ లబ్ది పొందే అవకాశం ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లడఖ్ గుండా రాకపోకలను సాగించాల్సి ఉంటుంది. ఫలితంగా- అక్కడ రోడ్లు, హోటళ్లు, పర్యాటక రంగానితో ముడిపడి ఉన్న మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఓవరాల్‌ గా సియాచిన్ గ్లేసియర్ ను సందర్శించాలని భావిస్తోన్న పర్యాటకులకు ఈ నిర్ణయం ఓ వరంలా మారింది.


నిజానికి ఇప్పటిదాకా సియాచిన్ గ్లేసియర్ ను స్థానికులు కూడా సందర్శించలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. లడఖ్ గానీ, చుట్టు పక్కల గ్రామాల వారు గానీ సియాచిన్ ప్రాంతాన్ని సందర్శించలేదు. కారణం- ఆర్మీనే. రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంది సైన్యం. సాధారణ ప్రజలకు కూడా ఇక్కడికి రాకపోకలు కల్పించే అవకాశం ఇవ్వలేదు. సైన్యానికి అవసరమైన సామాగ్రిని చేరవేయడానికి ఎంపిక చేసిన కొందరు కూలీలు, ఆర్మీ సన్నాహకాలను కవర్ చేయడానికి కొందరు జర్నలిస్టులకు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక ఎవ్వరైనా సియాచిన్ ను సందర్శించడానికి అవకాశం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: