అదేదో సినిమాలో బ్రహ్మానందం క్యారక్టర్ అంటుంది, ఇంకా పెళ్ళి చూపులు కూడా కాలేదు, అపుడే చుట్టాలైపోయారేంట్రా అని. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందేమో. ఎన్నికల ముందు బాహా బాహీగా పోరు జరిపి ఒకరిని ఒకరు దారుణంగా తిట్టుకున్న పార్టీలు నాలుగు నెలలు తిరగకముందే ఒక్కటి అయిపోయాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ కలయిక ఎపుడు జరిగింది. అవగాహన ఎలా కుదిరింది అన్నది మాత్రం విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాలి.


ఈ నెల 24న ఇసుక కొరతకు నిరసంగా ఏపీవ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇక విశాఖ జిల్లాలో జరిగే ఈ  ఆందోళన‌లలో టీడీపీతో పాటు, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం కూడా హాజరవుతాయని ఈ రోజు మీడియా సమావేశంలో మాజీ మంత్రి అయ్యన్న చెప్పుకొచ్చారు. నిజానికి టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న ఆందోళన ఇది. మరి ఇందులో మిగిలిన పార్టీలు ఎలా పాలుపంచుకుంటయన్నది చూడాలి. 


మరో వైపు బీజేపీ నేతలు మాకు ఏపీలో టీడీపీతో పొత్తు అసలు లేనేలేదని అంటున్నారు. ఇక వామ‌పక్షాలు ఎపుడో సైకిల్ దిగి వెళ్ళిపోయాయి. పవన్ జనసేన నవంబర్ 3న ఇదే విశాఖలో భారీ ర్యాలీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ సైతం ఇసుక కొరత మీద పోరాటమే చేస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే అన్ని పార్టీలు కలసి ఈ ఆందోళన‌ చేపడతాయని అయ్యన్న చెప్పడం మాత్రం కాస్తా ఆలోచించాల్సిన విషయంగానే ఉంది అంటున్నారు.


అయితే ఒక్క విశాఖలోనేనా, లేక ఏపీవ్యాప్తంగా ప్రతిపక్షాలు అన్నీ కలసి ఇసుక మీద ఆందోళన, అదీ టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు చేపడతాయా అన్న ప్రశ్న కూడా వస్తోంది. మరి ఓ వైపు వామపక్షాలకు, బీజేపీకి అసలు పొత్తు కుదరదు, మరి వారు ఈ ఉమ్మడి ఆందోళన‌లో ఎలా పాలుపంచుకుంటాయన్నది కూడా చర్చగా ఉంది. అయితే అయ్యన్న వారిని పాల్గొనమని పిలుస్తున్నారా లేక పాల్గొనేందుకు వారు అంగీకరించారా అన్న దాని మీద కూడా ఎక్కడా  క్లారిటీ లేదు.


మొత్తానికి అయ్యన్న చెప్పిన దాని ప్రకారం చూస్తే అన్ని పార్టీలను కలుపుకుని పోయి జగన్ మీద యుధ్ధం చేయాలన్న ఆలోచన మాత్రం టీడీపీకి ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తే ఆ పార్టీ వెనకాల  జూనియర్ పార్టనర్లుగా మిగిలిన పార్టీలు ఎంతవరకు అనుసరిస్తాయన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా అయ్యన్న చెప్పడం కాదు, మిగిలిన పార్టీలు చెబితేనే వారు కూడా టీడీపీలో కలసి ఆందోళన చేస్తునట్లుగా భావించాల‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: