ఇక దీపావళీకి నాలుగురోజులే సమయం ఉన్నది. ఏంచక్కా నచ్చిన టపాసులన్ని కొనుక్కోని ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చని ఇప్పటికే చాలా మంది పక్కాగా ప్లాన్ కూడా గీసుకొని వుంటారు. కాని అందరు గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం కాల్చే టపాసుల్లోనుండి వెలువడే పొగ గాల్లోకలవడం వల్ల ఎన్ని అనర్దాలు జరుగుతున్నాయో ఎవరైన గ్రహిస్తున్నారా, దీని వల్ల ఎదురయ్యే అనారోగ్యసమస్యలు ఎన్ని వస్తున్నాయో గుర్తిస్తున్నారా. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చే పండగ ఏం అవుతుందిలే అని అనుకుంటారు  కొందరు. కాని సంవత్సరానికి సరిపడా పోల్యూషన్‌ను ఆ ఒక్కరోజే గాల్లో కలుస్తుందని అర్ధం చేసుకోగలరు.


ఇకపోతే కళ్లు మిరుమిట్లు గొలిపే టపాసులు, అధిక శబ్దంతో ధ్వని కాలుష్యం వెదజల్లే క్రాకర్స్‌కు ఈ దీపావళికతో చెక్‌ పడనుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న భారలోహాల ఆనవాళ్లున్న ఈ టపాసులను అమ్మడం, పేల్చడం చేయరాదంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇవే మార్గదర్శకాలను పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ సైతం జారీ చేసింది. ఈ టపాసుల మోతలో, లెడ్, లిథియం తదితర భారలోహాలున్న కారణంగా సమీపంలోని పెట్రోలు బంకులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ నేపథ్యంలో పీసీబీ నగరంలో భారలోహాల ఆనవాళ్లున్న క్రాకర్స్‌ అమ్మెవారి గుట్టురట్టు చేయడానికి తనిఖీలకు శ్రీకారం చుట్టింది. తమ పరిశీలనలో ఇలాంటి క్రాకర్స్‌ పట్టుబడితే సదరు విక్రయదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించింది. ఇకపోతే భారలోహాల ఆనవాళ్లు ప్రధానంగా చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్రాకర్స్‌లోనే  బయట పడుతుండడంపై నగరవాసులు, పర్యావేరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇక  టపాసులు కాల్చేవారికి కొద్దిసేపు ఆనందం కలిగినా, వాటిద్వారా వెలువడే శబ్ద, వాయుకాలుష్యం నగర పర్యావరణనానికి ఎంతగానో కారణమవుతోంది.


ఇదేకాకుండా మానవ ఆరోగ్యంపైనా దుష్ప్రభావాలు చూపడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ప్రధానంగా అత్యధిక ధ్వనులు వెలువడే క్రాకర్స్‌ కారణంగా కర్ణభేరికి ముప్పు పొంచి ఉందని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రాకర్స్‌ నుంచి వెలువడే అత్యధిక పొగ ద్వారా ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, సిటీజన్లు స్వేచ్ఛగా శ్వాసించే పరిస్థితులు మృగ్యమవుతాయని హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశాలకు, కళ్లకు పొగబెట్టే ఈ క్రాకర్స్‌కు చెక్‌ పెట్టాలని సూచిస్తున్నారు. చూసారుగా ప్రకృతిలోని స్వచ్చమైన గాలిని మన ఆనందంకోసం ఎలా కలుషితం చేస్తున్నామో. దీని ద్వార తర్వాత బాధలు అనుభవించేది కూడ మనమే. కాబట్టి వీలైనంత వరకు కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నంచమంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు..


మరింత సమాచారం తెలుసుకోండి: