తననే జనం మళ్ళీ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చంద్రబాబు ఈ మధ్య పదే పదే చెబుతున్నారు. తనను ఓడించినందుకు జనం బాధపడుతున్నారని కూడా ఆయన అంటున్నారు. ఏపీలో జగన్ పాలన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రజాదరణ కోల్పోయిందని  కూడా బాబు అంచనా వేస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా కధలు  చెబుతున్న బాబు ఇపుడు ఎన్నికలు వస్తే నిజంగా గెలుస్తారా. అసలు తన సొంత సీటు కుప్పంలో బాబు రాజీనామా చేసి మళ్ళీ గెలవగలరా...


ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. ఏపీలో జనం కోరుకుంటున్నారని చెబుతున్న బాబుకు జనం అంటే అర్ధం తెలుసా అని ఆయన నిలదీశారు. జనం అంటే కుల మీడియాధిపతులు, తనకు భజన చేసే బ్రుందాలు కాదని బాబు గుర్తించాలని ఆయన అన్నారు. జనం అంటే పదమూడు జిల్లాల్లో ఉన్న ప్రజలు అన్న సంగతి బాబు తెలుసుకోవాలని కూడా విజయసాయి సెటైర్లు వేశారు. మరి ఇంతలా జనం తననే కోరుకుంటున్నారని బాబు చెబుతున్నారు కదా, అందువల్ల ఆయనకు ఒక సవాల్, ఇపుడు ఉన్నఫళంగా  కుప్పం సీటుకు బాబు రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి. అక్కడ మళ్ళీ పోటీ చేసి బాబు గెలిస్తే ఏపీ మొత్తం బాబునే కోరుకుంటుందని అంగీకరిస్తామంటూ విజయసాయి చేసిన సవాల్ నిజంగా గొప్పదే. బాబు సైతం వూహించనిదే. 


ఇలా కధలు చెప్పుకుంటూ జనాన్ని, ఇటు పార్టీ క్యాడర్ని మభ్యపెడుతూ బాబు మళ్ళీ మనకే పవర్ అంటున్నారు. అది కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే. దాంతో ఇపుడు విజయసాయి విసిరిన సవాల్ బాబు కచ్చితంగా స్వీకరించాలని అంటున్నారు. బాబుకు నిజంగా జగన్ సర్కార్ మీద వ్యతిరేకత కనిపిస్తే రాజీనామా చేసి గెలవచ్చు కదా అంటున్నారు విజయసాయిరెడ్డి. అది కూడా కుప్పం నుంచి పోటీ అంటే బాబుకు కూడా సులువే కదా అని సలహా ఇస్తున్నారు. కానీ కుప్పం ఇపుడు చాలా మారిపోయినిది. ఆ సంగతి బాబుకు కూడా తెలుసు. 2019 ఎన్నికల్లోనే కుప్పంలో మెజారిటీ సగానికి సగం పడిపోయిన నేపధ్యంలో బాబు తాజాగా మళ్ళీ ఎందుకు రాజీనామా చేస్తాడు, చేస్తే అక్కడే జగన్ సీఎం హోదాలో తిష్ట వేసి ఓడిస్తే బాబుకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు. అందుకే విజయసాయిరెడ్డి సలహాతో పచ్చి వెలక్కాయ బాబు నోట్లో పడిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: