మొత్తానికి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాను ఎవరి పక్షాన ఉంటారో తేల్చి చెప్పేశారు. ఇంతకాలం ఉండవల్లి మద్దతు ఎవరికుంటుందో అనే అయోమయం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండేది. అలాంటిది తాజాగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉంటానని తేల్చి చెప్పేశారు.

 

ఉండవల్లి అంటే కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విషయ పరిజ్ఞానం మెండుగా ఉన్న నేత, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పగలిగిన కొద్దిమంది నేతల్లో ఉండవల్లి ముందుంటారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం ఇలా.. విషయం ఏదైనా కానీండి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారనే పేరుంది ఉండవల్లికి.

 

అలాంటి ఉండవల్లి మాట్లాడుతూ జగన్ సక్సెస్ అవ్వాలనే తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. పాజిటివ్ ఓటుతో అధికారంలోకి రావటంతో తన ప్రభుత్వంపై జనాల్లో అంచనాలు బాగా ఎక్కువగా ఉన్న విషయాన్ని  జగన్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రైతు భరోసా పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో ఎవరిస్తే ఏంటి ? రైతులు లబ్దిపొందుతున్నారా లేదా ? రైతుల ఖాతాల్లో డబ్బు జమవుతోందా లేదా ? అన్నదే చూడాలన్నారు.

 

జానల అంచనాలను జగన్ అందుకోలేకపోతే వైసిపి సినిమా ఫెయిలయినట్లే అని తేల్చేశారు. మీడియం సైజు సినిమా అయితే ఎలాగో కలెక్షన్స్ రాబట్టుకుంటుందిలే అనుకోవచ్చట. భారీ బడ్జెట్ సినిమా అన్న తర్వాత అదే స్ధాయిలో కలెక్షన్లు రాకపోతే ఫెయిలైనట్లే లెక్కని ఉండవల్లి తేల్చేశారు.

 

100 రోజుల పాలనపై మార్కులు వేయాల్సిన అవసరం ఇపుడే లేదన్నారు. తన మిత్రుడు వైఎస్సార్ కొడుకుగా జగన్ కు తాను 100 మార్కులు వేస్తానన్నారు. అయితే కచ్చితంగా జగన్ బలపడాలనే తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అయినా వంద రోజుల పాలనకే మార్కులు వేయాలంటే ఎలాగ ? ఇంకా చాలా కాలం ముందుంది కదా చూద్దాం అన్నారు ఉండవల్లి. మొత్తం మీద అవసరమైతే తాను ఎవరి పక్షాన ఉంటాడో తేల్చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: