తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్‌లో గురువారం ఉదయం 8 గంటలనుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.ఇందుకోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ఫ‌లితం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు వ‌చ్చేయ‌నుంది.
మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. కౌంటింగ్ ​ప్రక్రియలో మొదటగా సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత పోలింగ్​ బూత్ నంబర్ల వారీగా కౌంటింగ్ మొదలవుతోంది. నేరేడుచర్ల మండలం దాచారం పోలింగ్ స్టేషన్ తో మొదలై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్ నగర్, గరిడేపల్లి మండలాల ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో పూర్తవుతుంది. ఉదయం తొమ్మిది గంటల సమయానికి తొలి రౌండ్ ఫలితం వస్తుందని, మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తవుతుందని స‌మాచారం.


టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో ఈ నెల 21న హుజూర్‌నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతితోపాటు మొత్తం 28 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీచేశారు. 302 పోలింగ్ కేంద్రాల్లో 2,36,842 మంది ఓటర్లకుగాను 2,00,754 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి టేబుల్ దగ్గర సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌తోపాటు పోటీచేసిన అభ్యర్థుల ఏజెంట్లు ఉంటారు. వీరి సమక్షంలో స్ట్రాంగ్‌రూంలో భద్రపరచిన ఈవీఎంలను రౌండ్లవారీగా తెప్పించి.. సీల్ తీసి లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌కు 14 టేబుళ్లపై 14 ఈవీఎంలను లెక్కిస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రాల నంబర్లవారీగా చిట్టీలు పెట్టి.. ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపికచేసి వాటిలోని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. పోలైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్‌లో సమానంగా వచ్చాయా పరిశీలిస్తారు.


కౌంటింగ్ హాల్‌లో ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. మార్కెట్‌యార్డ్ పరిసరాల్లోనూ 60 సీసీ కెమెరాల ద్వారా నిఘా కట్టుదిట్టంచేశారు. ఎస్పీ భాస్కరన్ పర్యవేక్షణలో ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 75 మంది ఎస్‌ఐలు తదితరులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎన్నికల పరిశీలకుడు సచింద్ర ప్రతాప్‌సింగ్, కలెక్టర్ అమయ్‌కుమార్, ఎస్పీ భాస్కరన్ తదితరులు కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: