చంద్రబాబు వ్యవహారం అంతా కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా మారింది. దీంతో ఆయన వ్యూహం పలిస్తుందా, లేక పాత రిజల్ట్ నే మళ్లీ చూపించి పత్తాలేకుండా చేస్తుందా... అన్న అనుమానాలయితే సర్వత్రా నెలకొన్నాయి. సరే పరిస్తితులు మారాయి, బాబు పాత విధానమే ఈ రోజు దేశ వ్యాప్తంగా అందరికి విజయాలను తెచ్చిపెడుతోంది కాబట్టి ఈ సారి ఆయనకు కూడా విజయం తెచ్చిపెడుతుందేమో.. అనుకోవడంలో తప్పులేదనుకోండి..... ఇంతకీ ఆయన పాత సారా ఏంటి, ఇప్పుడు కొత్త సీసాలో పోసి జనాలకు చూపిస్తున్నదేమిటో చూద్దాం.....చంద్రబాబు నాయుడు ఇక అన్ని విషయాలు పక్కన బెట్టి రాబోయే ఎన్నికల్లో విజయం కోసం ప్రజాఘర్జన పేరుతో ప్రచారపర్వం మొదలు పెట్టారు. రెండు పర్యాయాలు అధికారం కోల్పోయి, ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకుని తీరాల్సిన తరుణంలో చంద్రబాబు తన ప్రచార పర్వాన్ని వినూత్న రీతిలో, కొత్త వ్యూహాలు, కొత్త వాగ్దానాలతో చేపడతారు అని భావించారు. కాని కొత్త సీసాలో పాత సారా అన్న విదంగా 2009లో ఏ నినాదంతో ప్రచారం చేసారో ఇప్పుడే అదే అస్త్రాన్ని ఉపయోగించి ముందుకు పోతుండడం అందరిని ఆలోచింప చేస్తోంది. అప్పుడు కూడా కాంగ్రెస్ అవినీతి పై పోరాటం, తను చేసిన అభివృద్ది మంత్రంతో తెగ ప్రచారం చేసారు. కాని పలితం ఎలా ఉందో చూసాం. అలాంటప్పుడు ఇప్పుడు కూడా అదే విదానంతో పోవడంలో అర్థం ఏంటి, ఇందులో చంద్రబాబు మర్మం ఏదైనా ఉందా అన్న అనుమానాలయితే కలగడం సహజం. అదేంటో కూడా ఓ సారి ఆలోచిద్దాం. నిజానికి ముందుగా ఆత్మగౌరవయాత్ర పేరుతో చంద్రబాబు దాదాపు ప్రచార పర్వం మొదలు పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న విభజన, సమైక్యవాదాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని దీనికి అసలు కారకులెవరో ఎండగడుతూ ముందుకు పోయారు. విభజన బీజం వేసిందే వైఎస్సార్ అని, ఇప్పుడు కూడా కేసుల నుంచి తప్పించుకోవడం, బెయిల్ కోసం జగన్ విభజనకు ఒప్పుకుని సమైక్యం ముసుగువేసుకున్నారని చెప్పుకుంటూ ముందుకు పోయే పనిచేసారు. అయితే సడన్ గా ఇప్పుడు పంథా మార్చుకోవడానికి కారణం ఏమిటి, ఇది ఈ మద్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల పలితాలు వచ్చిన తర్వాత జరిగింది. దీనికి ఢిల్లీ పలితాలు మరింత దోహదం చేసాయి అన్న భావం అందరిలో కలుగుతోంది. కారణం ఆమ్ ఆద్మీ కేవలం అవినీతి, అభివృద్ది మంత్రంతోనే విజయబావుటా ఎగర వేసారు. బిజేపి కూడా ఇదే నినాదంతో అఖండ విజయాలను అందుకుంది. దీనిపైనే యువత దృష్టి పెట్టిందని ఈ ఎన్నికల పలితాలతో ప్రచారం జరిగింది. దీంతో చంద్రబాబు ఇలా తన పాత విధానానికే పదును బెట్టారు అనుకుంటున్నారు. పైగా ప్రస్తుతం ఆయనకు ప్రధాన ప్రత్యర్థి జగన్. జగన్ ను నిలవరించాలంటే చంద్రబాబు వద్ద ఉన్న ప్రధాన ఆయుదం కూడా జగన్ పాల్పడిన అవినీతిని ఎండగట్టడమే. సమైక్యం అనాలన్నా కూడా ఈ విషయంలో చంద్రబాబు కంటే కాస్తా బెటర్ గా జగనే ఉన్నారు. పైగా తాను పొత్తుపెట్టాలనుకుంటున్న బిజేపి కూడా దేశ వ్యాప్తంగా అవినీతి, అభివృద్ది అస్త్రాన్నే ప్రయోగిస్తోంది. కాని దేశంలో ఇవి ప్రధాన అస్త్రాలే, కాని ఏపిలో పరిస్తితులు వేరు, సమస్యలు, అభివృద్ది, అవినీతి, అక్రమాలు వంటి వాటిని ఆలోచించడం కన్నా రాష్ట్రవిభజనపైనే దృష్టి సారించారు. సెంటిమెంట్ అనేదే రెండు ప్రాంతాలలో బలంగా ఉంది, సెంటిమెంట్ ముందు ఏవి పనిచేయవన్నది కూడా అందరికి తెలిసిందే. అందుకే చంద్రబాబు తప్పు చేస్తున్నారా, విభజన అంశం ఎంత గింజుకున్నా జరగాల్సింది జరుగుతుంది దానిని రాష్ట్ర పార్టీలు ఆపలేవు, అంతా దానిని రాజకీయంగా లాభం పొందడానికే వాడుకుంటున్నారు అని భావించి అసలైన సమస్యలపై సమరశంఖం పూరిస్తున్న చంద్రబాబుకు బ్రహ్మరథం పడతారా అన్నది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: