ప్రస్తుతం ఏపీలో పాలిటిక్స్ నడపడం....ఢిల్లీలో రాజకీయం చేసినంత ఈజీ కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి అర్థమైపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ నే ఖంగు తినిపించి అధికారం చేపట్టిన ఈ పార్టీకి ఏపీలో మాత్రం షాక్ తగిలింది. హైదరాబాద్ లోని ఏవీ కాలేజీలో జరిగిన ఆమ్ ఆద్మీ సభలో విభజన వేడి ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఏం చేయాలో అర్థం కాలేదు. దేశ రాజధానిలో దుమ్మురేపిన పార్టీకి రాష్ట్ర రాజధానిలో చుక్కలు కనిపించాయి. హైదరాబాద్ లో నిర్వహించిన సభ జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో దద్ధరిల్లింది. పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు కోసం ఏవీ కళాశాలలో నిర్వహించిన సభలో తెలంగాణ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్ భూషణ్ కు పెద్ద ఎత్తున విభజన సెగ తగలడంతో ఆయన... చిన్న రాష్ట్రాలకు ఆప్ ఎప్పుడూ అనుకూలం అని ప్రకటించారు.  ప్రశాంత్ భూషణ్ ప్రకటనతో కొందరు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. దాంతో పోటాపోటీగా మరికొందరు జై తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో కొంత సేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశలో ఆప్ నిర్వహించిన ఈ కార్యక్రమం నిరసనలతోనే ముగిసింది. మరోవైపు ఆప్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన బిజేపీ కార్యకర్తలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. మరో వైపు పార్టీ వేదికపై సామాన్యుడికి అవకాశం కల్పించలేదని పలువురు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య సమావేశం ముగిసింది. ఏపీలో ఆప్ కు తగిలిన షాక్ ఢిల్లీలోని అధినాయకుడిని ఆలోచనలో పడేసింది. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ఎదగాలంటే ఎన్ని లాజిక్కులు, లాజిక్కులు చేయాలో....ఎన్ని వ్యూహాలు పన్నాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా తెలుసుకోవాల్సి ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: