కొన్ని నెలల కిందట.. దేశ వ్యాప్తంగా ఒకే అంశం మీద అందరి చూపులు నిలిచాయి. ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన వరదలతో వేలాది మంది భక్తులు కేధార్ నాథ్ లో ఇరుక్కుపోయారు. అక్కడ వాటిల్లిన నష్టం గురించి రాష్ట్ర, కేంద్ర ఊహించిన దాని కంటే చాలా భారీగా ఉంటుందన్న విషయం చాలా ఆలస్యంగా అర్థమైంది. దీంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దానికి తగ్గట్లే ఎడతెరపి లేకుండా కురిసే వర్షం.. వరద పోటెత్తటంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా విలువైనదే. అలాంటి సమయాల్లో తీసుకునే నిర్ణయం ఏ మాత్రం ఆలస్యమైనా చెల్లించాల్సిన మూల్యం భారీగానే ఉంటుంది.ఈ విషయం వేలాది మంది ప్రజలకు అర్థమైంది కూడా. అలాంటి పరిస్థితుల్లో వేలాదిగా చిక్కుకుపోయిన బాధితుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం అన్నింటి కంటే పెద్ద సమస్య. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత భారీగా ప్రాణ నష్టం జరిగిందంటే.. అది ఉత్తరాఖండ్ వరదల సమయంలోనే. ఆ సమయంలో అక్కడ చిక్కుకున్న బాధితుల్ని తరలించేందుకు అందరి కంటే ముందు మేల్కొన్న వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీనే. ఆ తర్వాతే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వస్తారు. నిజానికి ఈ సంఘటన వెలుగు చూసిన సమయంలో బాబు అమెరికాలో ఉన్నారు. హైదరాబాద్ లోఅడుగుపెట్టిన వెంటనే ఆయన పరుగులు పెట్టిన వైనం అందరినీ ఆకట్టుకుంది. ఒక సమర్థుడైన నాయకుడు ఎలా వ్యవహరిస్తారన్న దానికి నిదర్శనంగా మోడీ.. బాబులు మిగిలారు. దేశ ప్రజానీకమంతా ఊపిరి బిగపెట్టిన సమయంలో.. యువరాజు రాహుల్ మాత్రం అస్సలు కనిపించలేదు. దేశాన్ని మొత్తంగా మార్చేస్తాం.. కాంగ్రెస్ పార్టీకి మించిన రక్షణ మరెవరూ ఇవ్వలేరంటూ బడాయి మాటలు చెప్పే రాహుల్ ఉత్తరాఖండ్ వరద తీవ్రత బాహ్య ప్రపంచానికి బాగా తెలిసాక ఆయన రంగంలోకి దిగారు. అది కూడా.. జరుగుతున్న సహాయ చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించేందుకే. తన మాటలతో విపరీతమైన భావోద్వేగానికి గురి చేసే ఆయన చేతల్లో అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. బాధితులకు సాయం చేసేందుకు వీలుగా కేంద్రం అత్యవసర వస్తువులతో కూడిన లారీల్ని సిద్ధం చేశారు. కానీ.. అవి 48 గంటలకు పైనే కదల్లేదు. కారణం ఏమిటని ఆరా తీసిన వారికి కళ్లు చెదిరే వాస్తవం తెలిసింది. ఆ లారీల్ని రాహుల్ జెండా ఊపాలన్నది నిర్ణయం. కానీ.. యువరాజా వారు అందుబాటులో లేరు. ఆయన తీరిక చేసుకొని వచ్చాక తాపీగా లారీలు కదిలాయి. ఓ పక్క వేలాది బాధితులు ఆకలితో అల్లాడిపోతుంటే.. వారికి సాయంగా వెళ్లే లారీలకు జెండాలు ఊపి.. ఓ ఉత్సవం మాదిరి కార్యక్రమం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అది ప్రచారం కోసం చూడాల్సిన సమయమా? అన్న విమర్శలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటివేమీ పెద్దగా పట్టలేదు.అందుకే చెబుతారు. కొన్ని విషయాల మీద అవగాహన మరింత పెంచుకోవటానికి చరిత్రలోకి వెళ్లటానికి మించిన మంచి మార్గం మరొకటి ఉండదని. అందులోకి రాహుల్ గాంధీ లాంటి యువరాజు గురించి మరింత స్పష్టత తెచ్చుకోవటానికి.. ఆయన మాటలకి, చేతలకు మధ్య అంతరాన్ని గతం చాలా బాగా గుర్తు చేస్తుందనటంలో సందేహం లేదు. వర్తమానంలోకి వస్తే.. ఇదే రాహుల్ గృహిణులకు ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లు తొమ్మిది సరిపోవని.. వాటి సంఖ్యను పన్నెండుకు పెంచాలని తన ప్రసంగంలో కోరారు. అంతే యుద్ధ ప్రాతిపదికన యూపీఏ ప్రభుత్వం స్పందించింది. రాహుల్ కోరిక పట్ల సానుకూలంగా వ్యవహరిస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. ఇది జరిగిన రెండు, మూడు రోజులకే జైనులను మైనార్టీ హోదా కల్పించటమే కాదు.. వారికి అన్నీ ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యులు అవుతారన్న నిర్ణయం కూడా రాహుల్ పుణ్యమే. జైనులకు మైనార్టీ హోదా కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం యువరాజు కోరిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. అంతేనా.. ఆ మధ్య నేర చరిత ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఓ ఆర్డినెన్స్ జారీ చేస్తే.. దానిపై రాహుల్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చివరికి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సైతం చెత్తకుప్పలో పడేశారు. ఇంతా చేస్తే యువరాజుగా కీర్తించబడే రాహుల్ ఒక ఎంపీ మాత్రమే. అంతకు మించి పెద్ద హోదా కూడా ఏమీ లేదు. పార్టీ పరంగా చూస్తే.. ప్రచార కార్యదర్శి మాత్రమే. కానీ.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని ఏన్నో పనుల్ని ఆయన అవలీలగా చేసి పారేస్తారు. తాజాగా కేజ్రీవాల్ కు.. కేంద్రానికి రగడ చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఢిల్లీలో రెండు రోజుల పాటు రచ్చ రచ్చ అయిన వ్యవహారాన్ని సింఫుల్ గా చెబితే.. పని తీరు సరిగా లేని.. మాట వినని పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అది కూడా ముఖ్యమంత్రి స్వయాన వెళ్లి.. కేంద్ర మంత్రిని కలిసి చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ.. కేంద్రం ససేమిరా అంది. ఏ విషయ మీదనైనా పోరాడే తత్వం ఉన్న కేజ్రీవాల్ మంత్రాంగం ద్వారా కంటే కూడా.. ఉద్యమ పంథాలో తాను అనుకున్న పనిని సాధించేందుకు సిద్ధమయ్యారు. ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా ఆయన కేంద్రంపై కాలు దువ్వారు. దీన్లో తప్పు కేంద్రానిదే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోమంటే కేంద్రమంత్రి అస్సలు పట్టించుకోకపోవటం.. తెగేదాకా లాగటం యూపీఏ సర్కారుకు మాత్రమే చెల్లుతుందేమో. కేంద్రప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం (అధికార పార్టీ ఎంపీ మినహా) లేని వ్యక్తి కోరిన కోర్కెల్ని క్షణాల మీద తీర్చే ప్రభుత్వం.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన విధంగా అధికారుల మీద చర్యలు తీసుకోరెందుకు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కేంద్రం వైఖరి చూసినప్పుడు ఇగోతో నిండిన వ్యక్తిగా మారినట్లు కనిపిస్తుంది. కేజ్రీవాల్ చెప్పిన విధంగా పోలీసుల మీద చర్యలు తీసుకుంటే.. ఎక్కడ తమ పట్టు తగ్గిపోతుందోనన్న కారణం షిండే మొండిగా వ్యవహరించేలా చేసింది. ఓ ముఖ్యమంత్రి రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసేలా చేయించింది. నిజానికి కేజ్రీవాల్ స్థానంలో రాహుల్ ఉండి.. ఆయన నోటి వెంట పోలీసు అధికారుల పని తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఉంటే.. వారు కచ్ఛితంగా శంకరగిరి మాన్యాలకు పట్టి ఉండేవారు. దేశ పరిపాలన మొత్తం ఒక వ్యక్తి కేంద్రం సాగుతోంది. ఇది ఎంతమాత్రం క్షేమకరం కాదు. కేజ్రీవాల్ కోరినట్లు చేస్తే ఎక్కడ కేంద్రం తగ్గినట్లు అవుతుందోనని భావించటం.. అదే సమయంలో రాహుల్ నోటి వెంట మాట వస్తే చాలు దాన్ని పూర్తి చేసేందుకు మొత్తం వ్యవస్థ పరుగులు పెట్టటం కూడా సరైన పద్ధతి కాదు. ఈ పరిణామం దేశానికి హితం కాదు. దేశం గురించి ఆలోచించే పరిస్థితుల్లో కేంద్రంలోని యూపేఏ సర్కారు ఉందంటారా?

మరింత సమాచారం తెలుసుకోండి: