ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు -2013పై శాసనసభలో చర్చ గడువు పొడిగింపు వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటీ ? గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ ఆంతర్యం ఏమిటీ ? ఇలాంటి అనేక ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించడానికి రాష్ట్రపతి ఈనెల 30వరకు పొడిగించారు. గణతంత్ర దినోత్సవం మినహాయిస్తే మరో ఆరు రోజుల పాటు టి బిల్లుపై శాసనసభలో చర్చ జరగనుంది. తాజాగా గడువు పెంచడం వెనుక కాంగ్రెస్ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  టి బిల్లు గడువు పెంపు వల్ల సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలను సంతృప్తిపరచడంతో పాటు టిఆర్ఎస్ విలీనం సంగతి లెక్కలను తేల్చాలని కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ కేసీఆర్ విలీనానికి ఒప్పుకోకపోతే విభజన బిల్లును వ్యవహారాన్ని పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మాసంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో టి బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ రెబల్స్ ను అడ్డుకునేందుకు ఈ సమయం బాగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం  ఇందులో బిజెపిని ఇరుకున పెట్టేందుకు వ్యూహం రచించింది. బిల్లుకు కొన్ని సవరణలను బిజెపి ప్రతిపాదించింది. సవరణలు తాము ఆమోదించలేమని చెప్పి విభజన వ్యవహారాన్ని బిజెపిపై రుద్దాలని కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ వేస్తున్న వ్యూహం ఫలిస్తుందా ? బెడిసి కొడుతుందా ? వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: