హైదరాబాద్‌ పంజాగుట్ట తనిష్క్‌ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ చోటుచేసుకుంది. దాదాపు 30 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు యాజమాన్యం చెబుతోంది. దీని విలువ 9కోట్ల రూపాయలుంటుందని అంచనా. గుర్తుతెలియని దుండగులు దుకాణం వెనుక భాగంలో గోడకు కన్నం వేసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సేఫ్ లాకర్‌‌ను పగలగొట్టి బంగారు నగలతో పాటు వెండి వస్తువులను కూడా దొంగిలించారు. సీసీటీవీ ఫుటేజీకి దొరక్కుండా, అలాగే ఫింగర్ ప్రింట్లు కూడా ఎక్కడా పడకుండా వాళ్లు జాగ్రత్త పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ భారీ చోరి జరిగినట్లు కనిపిస్తోంది. రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రస్తుతం విచారించే పనిలో పడ్డారు. ఈ చోరీకి సంబంధించిన ఫిర్యాదు పోలీసులకు శనివారం ఉదయం 10.20 గంటలకు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు టీంలను ఏర్పాటు చేశారు. ఒక టీం క్లూస్ లాంటివి సేకరిస్తే, రెండో టీం షోరూం దగ్గర్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించే పనిలో పడింది. ఇక చివరి టీం చోరీకి పాల్పడిన వారి గురించి అన్వేషణలో పడింది. గతంలో పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ బంగారు దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ చోరీ నిందితులను సిటీ పోలీసులు ముంబాయిలో అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: