తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అనుకూలమా? వ్యతిరేకమా? అనేది ఇప్పటి వరకూ అంతుబట్టని వ్యవహారమే! మొదట్లో జై తెలంగాణ అని చెబుతూ, ఆంధ్రప్రదేశ్ ను రెండు విభజించి తీరాల్సిందేనన్న బీజేపీ ఇప్పుడు క్రమంగా మాట మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం గురించి పట్టించుకోకుండా ఉన్నంత సేపూ బీజేపీ తెగ హడావుడి చేసింది. తెలంగాణ తరపున వాయిస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్ ను విభజించాల్సిందేనని స్పష్టం చేసింది. పార్లమెంటులో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణ డిమాండ్ ను వినిపిస్తూ కన్నీరు కార్చింది. అయితే ఇప్పుడు అదే నాయకురాలు తెలంగాణ అంశం గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. పార్లమెంటు సమావేశాల గురించి అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చలో సుష్మాస్వరాజ్ మాటలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. తెలంగాణ బిల్లు గురించి మాట్లాడకుండా.. అసలు కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభను జరగనిస్తారా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ ఎంపీలు చర్చను జరగనివ్వరని, తెలంగాణ బిల్లును అడ్డుకొంటారని సుష్మా వ్యాఖ్యానించింది. మరి వారిని కంట్రోల్ చేయమని సుష్మా చెప్పలేదు! పైపెచ్చూ సభ్యులను సస్సెండ్ చేస్తే తాము సహించేది లేదని బీజేపీ వాళ్లు చెబుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ఎంపీలే బిల్లును అడ్డుకొంటారని అంటూ మరోవైపు వారిని సస్పెండ్ చేయడానికి వీలు లేదని అంటూ బీజేపీ తెలంగాణ బిల్లుకు ఎలా ఆటంకం కలగనుందో పరోక్షంగా హింట్ ను ఇచ్చినట్టు గా ఉంది. స్వయంగా బీజేపీ పార్లమెంటరీ పక్ష నాయకురాలే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ బిల్లు గురించి అంతగట్టిగా మాట్లాడని ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ బిల్లును పట్టుబట్టి ఆమోదింపజేస్తుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: