ఏకాగ్రతలేని నాట్యాన్నే భరించలేని మనం నీతి లేని నాయకులను ఎందుకు ఆదరిస్తున్నాం. కడుపులో ఉన్నది మగ బిడ్డో, ఆడ బిడ్డో ముందే తెలుసుకోవడం నేరం అని భావించే మనం...మన కడుపుకోతకు కారణమయ్యే వాడినే నాయకునిగా తెలిసి తెలిసి ఎందుకు ఎంచుకుంటున్నాం. సమాజం శరీరం అయితే రాజకీయం జబ్బుగా మారినపుడు మనం మందు వేయకుడదా? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అనే ప్రజాస్వామ్యం...ప్రజల నుండి, ప్రజలే హుండి అనే స్థాయికి దిగజారిందని మనం గమనించలేకున్నామా? వండే వంట రుచిని పెంచటానికి ఇంకేం చేయాలో చర్చాగోష్టి చేస్తాం కానీ..మనం ఉండే దేశ భవిష్యత్తుని పెంచేందుకు ఏం చేయాలో తర్కించి నిర్ణయించలేమా? మనం కోరుకుంటున్నది ఇదే అని మనకి కూడా తెలియనంతగా...వారు నిర్ణయిస్తూ రాష్త్ర విభజనలు చేస్తుంటే మనం ఇంకా వారి భజనలే చేస్తూ ఉండటం విషాదకరం. ఇది మున్ముందు మరింత ప్రమాదకరం. వాసుకి సాయంతో సాగరమధనం చేస్తే అమృతం, విషం వెలువడ్డాయి. ఏ సర్పంతో మధనం చేస్తే మలినంలేని నాయకులొస్తారు? ఏ కాలసర్పం కాటేస్తే నాయకుల్లో మార్పులొస్తాయి. ప్రజాక్షేమమే ధ్యేయంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రజలకు క్షామమే ఫలితంగా మిగులుస్తున్నాయి. పన్నీటి వర్షంలో తమని ముంచెత్తుతారని తలచి ఎన్నుకోబడ్డ నాయకులు...వారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తున్నారు. రాజకీయనాయకులు తమని ఎరగా వాడి సముద్రంలో సైతం ఆస్తులు కొంటున్నా ప్రజలు ప్రేక్షకులుగానే మిగిలిపొతున్నారు. తమ వోటు విలువని నోటుగా భావించి వారి ఖాతాల్లో ఎమౌంటును పెంచుతున్నామని మనకి తెలీదా?? మనం ప్రజలా?? ప్రేక్షకులా?? ఈ ప్రజాస్వామ్యదేశంలో మనం ప్రేక్షకులో, సాక్షులో కాదు....మనమే నియంతలం, నిర్ణేతలం. మన దేశాన్ని కాపాడి, మన భవిష్య తరాలకి భవిష్యత్తుని కల్పించాల్సిన బాధ్యత మనమీదుంది. ఏ దేశమేగినా, ఎందెందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నాడో మహకవి. పొగడడానికి ఏముంది అవినీతి తప్ప అనే స్థాయిని పొగొట్టే చిరుప్రయత్నం చేద్దాం. ఆలోచించి సరైన నాయకుల్ని ఎన్నుకుందాం

మరింత సమాచారం తెలుసుకోండి: