తన ఒకప్పటి చొక్కా నీ దేహంపై వస్త్రం అవుతుంది. తన అడుగు నీకు ఆదర్శం అవుతుంది. తన గమ్యాన్ని, గమనాన్ని లోకం నిన్ను ఎన్నుకోమంటుంది. తను నడిచే శైలి నిన్ను ప్రభావితం చేస్తుంది. తను ప్రవర్తించే తీరు నీ నడవడికను నిర్దేశిస్తుంది. అమ్మలోని అనురాగాన్ని, నాన్నలోని పెద్దరికాన్ని కలుపుకుని నీతో నడిచే స్నేహితుడే....అన్న. ఈ లోకంలోని వింతలను తొలిసారి నీకు తన కనులతో చూపిస్తాడు. నీ కష్టాన్ని, ప్రేమని తన వాటిగా భావిస్తాడు. లోకం తీరుని వివరిస్తాడు. నువ్వు భయపడితే ధైర్యం చెబుతాడు. నువ్వు ఏడిస్తే కారణం కనుగొని దానిని దూరం చేసుకునే మార్గం చెబుతాడు. నీ శోకానికి కారణమైన వారిని ద్వేషిస్తాడు. నీ జీవితంలో నాన్న తరువాత కథానాయకుడు అన్న. నిన్ను కాదనుకునేవారికి మొట్టమొదటి ప్రతినాయకుడు అన్న. నిన్ను దుఃఖం నుండి తప్పించి నవ్వించేందుకు హాస్యనటుడు అయ్యేవాడు అన్న. నీ జీవన చలనచిత్రంలో నీ భుజం తట్టి నడిపించే దర్శకుడు అన్న. నీ నిర్ణయం సరైనదయితే అమ్మ దగ్గర నిన్ను సమర్ధిస్తాడు, నాన్న అనుమతికై అర్ధిస్తాడు. నీ సంతోషానికై ఏం చేయాలో ఆలోచిస్తాడు. నీ గెలుపుని పదుగురికి చెప్పి గర్విస్తాడు. తన ఔన్నత్యాన్ని గుర్తించు. తన ప్రేమని గౌరవించు. నీ నుదుటిని తాకిన తన మొదటి ముద్దుని ఆస్వాదించు. తన కళ్ళల్లో నీపై అపారమైన ప్రేమను గమనించు. నీ మనసులో తనపై అభిమానాన్ని పెంపొందించు.

మరింత సమాచారం తెలుసుకోండి: