రాష్ర్ట విభజన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సొంత పార్టీలోనే ఉండాలా లేక మరో పార్టీలో చేరాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఏపార్టీలోకి వెళితే అధిక ప్రయోజనం కలుగుతుందనే మీమాంసను వారు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఆలోచన ఏంటి? రాష్ట్రవిభజన బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు క్రాస్‌ రోడ్‌లో నిలుచున్న పరిస్థితి కనిపిస్తోంది. విభజన అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. ఈ నేపథ్యంలోనే తమ తమ రాజకీయ భవిష్యత్తు అన్వేషణలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తలమునకలయ్యారు. మరీ ముఖ్యంగా సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ ప్రయత్నాలు మమ్మురం చేశారు. టిక్కెట్టు ఖాయంగా హామీ తీసుకున్న నేతలు ఇప్పటికే వివిధ పార్టీల్లోకి జంప్‌ అవ్వగా.. తాము వెళ్లాలని భావించిన పార్టీల నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో ఇంకా కొందరు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కొత్త పార్టీ వస్తున్నట్లు స్పష్టం అవడంతోపాటు టిడిపి నుంచి కొందరు సీనియర్లు ఇస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఎటు అడుగులు వేయాలి అన్న మీమాంసను వారు ఎదుర్కొంటున్నారు. అటు.. సీమాంధ్ర ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొనడం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తకపోవడం వంటి పరిణామాలతో జంప్‌ అవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల వైఖరిలో మార్పులు వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లోనే కొనసాగితే కొత్త సర్కార్‌ ఏర్పడితే కేబినేట్‌ హోదా లభించవచ్చన్న భావనతో మంత్రులు కానీ సీమాంధ్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. 2నెలల పాటు ఆ పదవిలో కొనసాగినా మంత్రి అన్న హోదా ఉంటుందని, మళ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి హోదాలో వెళ్లవచ్చని.. ఒకవేళ ఓడినా మాజీ మంత్రిగా నిలిచిపోవచ్చని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లాలా అన్న సందిగ్ధతను వారు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. పార్టీని వీడొద్దంటూ సీనియర్‌ మంత్రులు రంగంలోకి దిగి పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. విభజనలో తమ పాపం లేదని, లేఖలు ఇచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టిడిపియే విభజనకు కారణమయ్యాయని ప్రజలకు చెబుదామన్న భరోసాను పార్టీ ఎమ్మెల్యేలకు సీమాంధ్ర సీనియర్‌ మంత్రులు నచ్చజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీని వీడటంలోనూ, కిరణ్‌ కుమార్‌రెడ్డి కొత్త పార్టీలోకి వెళ్లే విషయంలోనూ, ఇతర పార్టీలవైపు దృష్టి సారించే విషయంలోనూ సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు మీమాంసను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: