సినిమా వేరు. రాజకీయం వేరు. సినిమా నటుడు వేరు. రాజకీయ నాయకుడు వేరు. రాజకీయ నాయకుడు సినిమా నటుడు కావచ్చు. కేవలం దర్శకుడు చెప్పినట్లు చేసే నేర్పు ఉంటే చాలు అందుకు. సినిమా నటుడు రాజకీయ నాయకుడు కావచ్చు. కానీ, అతను జనంతో మమేకమై ఉండి ఉండాలి. జనం బాధలు తెలిసి ఉండాలి. వాటికి పరిష్కార మార్గాలు ఆలోచించగలిగే శక్తి ఉండాలి. కనీసం ప్రజల సమస్యలకు స్పందించే గుణం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా జనంతో అతనికి సంబంధం ఉండి ఉండాలి. రాజకీయ నాయకుడిని అభిమానించవచ్చు. రాజకీయ నాయకుడు సినిమా నటుడిగా మారితే అప్పుడు కూడా అతని నటన బాగుంటే సినిమా నటుడుగా కూడా అభిమానించవచ్చు. అంతే తప్పితే, రాజకీయ నాయకుడిగా అభిమానం ఉందని, బాగా లేకపోయినా అతడిని సినిమా నటుడిగా ఎవరూ అభిమానించరు. అదే సమయంలో, సినిమా నటుడు రాజకీయ నాయకుడిగా మారాడనుకోండి. అరంగేట్రం చేసినప్పుడు సినిమా నటుడిగా ఉన్న అభిమానంతో రాజకీయ నాయకుడిగానూ అభిమానించడం సహజం. ఆ తర్వాత అతడు రాజకీయ నాయకుడిగా పనికిరాడని తెలిస్తే కేవలం సినిమా నటుడిగా అభిమానించి రాజకీయ నాయకుడి పాత్రను తమ మదిలోంచి తుడిచేసిన వాళ్లను కూడా చూశాం మనం. అయితే, మొట్టమొదటి నుంచే సినిమా నటుడిని సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడిగా చూస్తే తర్వాత ఆవేదన చెందాల్సిన అవసరం ఉండదు. బాధలు పడాల్సిన అవసరం ఉండదు. సినిమా నటుడు రాజకీయంగా కూడా రాణిస్తే, అంత మేథో సామర్థ్యమే ఉంటే తప్పకుండా అభిమానించవచ్చు. కానీ, ఆ సామర్థ్యం తెలియకుండా ముందే కుప్పిగంతులు వేస్తే తర్వాత ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. సినిమా హీరో గొప్పేంటి? ఎందుకింత పిచ్చిగా అభిమానిస్తున్నారు? అతడు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అని ప్రశ్నించే ముందు ఒకసారి సినిమాలో హీరో పాత్ర ఏమిటో చూద్దాం. ఇందుకు పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమానే ఉదాహరణగా తీసుకుందాం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక్కడే హీరో అంటే మిగిలిన వారి ప్రతిభను పాతాళానికి తొక్కేసినట్టే. పవన్ కల్యాణ్ తోపాటు ఈ సినిమాలో మరెంతో మంది హీరోలు ఉన్నారు. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దింది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కు సరిపోయేలా గౌతమ్ నందా క్యారెక్టర్ ను తీర్చిదిద్దింది కూడా దర్శకుడే. గౌతమ్ నందాకు ఉండే ఎమోషన్స్, బాడీ లాంగ్యేజితోపాటు ప్రేక్షకులకు వినోదం పంచడానికి తనదైన పంచ్ డైలాగులను త్రివిక్రమే రాశాడు. సినిమాలోని అహల్య అమాయకురాలు ఎపిసోడ్, పవన్ కల్యాణ్ బాబాగా అలరించే ఎపిసోడ్ కూడా దర్శకుడి సృష్టే. ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ కాకుండా ఉండి ఉంటే ఎంత హిట్ అయి ఉండేదో ఓసారి ఆలోచించండి. సినిమా హీరో పవన్ కల్యాణ్ కే మొత్తం క్రెడిట్ ఇచ్చేసి దర్శకుడి ప్రతిభను తక్కువ చేసి చూడడం ఎంత వరకు సరైనదో కూడా ఆలోచించండి. అలాగే, ఈ సినిమాకు పాటలు రాసింది రామజోగయ్య శాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్. సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్. కిరాక్ పాట, దానికి దేవిశ్రీ కొట్టిన సంగీతం సినిమా మొత్తాన్ని ఊపేసింది. వాటితోపాటు మిగిలిన పాటలు కూడా హిట్ అయ్యాయి. ఆ సినిమాలో ఆ పాటలు, ఆ సంగీతం కాకుండా ‘మనుషులతో జాగ్రత్త’ సినిమాలోని పాటలు, సంగీతం పెట్టి ఉంటే సినిమా ఎంత హిట్ అయి ఉండేది. అటువంటప్పుడు సినిమాకు రామజోగయ్య శాస్త్రి, దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోలే. ఇక సినిమాకు మరో ఆకర్షణ కెమెరామన్ ప్రసాద్ మూరెళ్ల. ఇంకో ఆకర్షణ నదియా, సమంత, ప్రణీత.... ఒక సినిమాలో ఇంతమంది కష్టపడి పని చేస్తేనే కదా అది హిట్ అయ్యేది. వీరిలో ఏ ఒక్కరు సరిగా పని చేయకపోయినా సినిమా ఫ్లాపే కదా. అప్పడు సినిమాకు మొత్తం క్రెడిట్ ను ఒక్క హీరోకే ఇచ్చేయడం ఎంత వరకు సమంజసం? నిజంగా మాట్లాడుకోవాలంటే సినిమాలో హీరో చేసేది ఏమిటో తెలుసా? దర్శకుడు చెప్పింది చేయడం. అంతే. ఈ నిజాన్ని పిచ్చిగా ప్రేమించే అభిమానులకు స్పష్టం చేయడానికే రాజమౌళి ‘ఈగ’ సినిమా తీశాడు. ఈ సినిమాలో హీరో ఈగనా? రాజమౌళినా? కథలో, కథనంలో, దర్శకుడిలో దమ్ముంటే ఈగ హీరో అయినా ఒకటే. పవన్ కల్యాణ్ హీరో అయినా ఒకటే కదా? సినిమాలో చెప్పింది చేసే హీరోను ప్రజల జీవితాలతో ప్రత్యక్ష ప్రమేయం ఉండే రాజకీయాల్లో కూడా పిచ్చిగా అభిమానించడం ఏమిటి? సదరు హీరోకు నిజంగా మంచి ఆలోచనలు ఉండి ఉంటే.. వాటిని ఆయన చక్కగా ప్రెజెంట్ చేసి ఉంటే లేదా ఏదైనా ఒక్కటైనా చేసి ఉంటే స్వాగతించవచ్చు. అభిమానించవచ్చు. కానీ, పవన్ కల్యాణ్ విషయాన్నే తీసుకుందాం. ఆయన తన అజెండాను కూడా పూర్తిగా చెప్పలేకపోయాడు. తన పార్టీ విధి విధానాలను కూడా చెప్పలేకపోయాడు. తన పార్టీకి ఆ గుర్తు ఎందుకు పెట్టాడో చెప్పలేకపోయాడు. వాటికి భావావేశం అడ్డు వచ్చిందని అనుకుందాం. ఆ తర్వాత అయినా మరో మార్గంలో అయినా ఈ వారంలో రోజుల్లో తన ఆలోచనలు, తన పార్టీ విధి విధానాలను వివరించవచ్చు కదా. ఆ పని చేయలేదు. రెండోది.. ఐదేళ్ల కిందట ప్రజారాజ్యాన్ని పెట్టినప్పుడు కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేశాడు. ఐదేళ్లుగా దాని అతీ గతీ లేదు. దాని ద్వారా చిన్న కార్యక్రమం కూడా చేయలేదు. ఐదేళ్ల కిందట ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కనీసం ప్రజల ముఖం కూడా చూడలేదు. అయినా, పవన్ కల్యాణ్ ను రాజకీయ నాయకుడిగా కూడా అంత పిచ్చిగా ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కాదు. పవన్ కల్యాణ్ ను రాజకీయాల్లోకి స్వాగతించవచ్చు. అభిమానించవచ్చు. ఎప్పుడు? ఆయన నరేంద్ర మోదీకో చంద్రబాబుకో చెంచాగా ఉండకుండా ఎన్టీ రామారావు తరహాలో స్వతంత్రంగా పని చేసినప్పుడు. ఆయనలా తన విజన్ ను సుస్పష్టంగా ప్రజలకు వివరించినప్పుడు. రాజకీయాల్లోకి వచ్చే ముందు కాస్తంత అయినా ప్రజల బాధలు పట్టించుకున్నప్పుడు. కనీసం పట్టించుకుంటాననే భరోసా ఇచ్చినప్పుడు. కానీ, పవన్ కల్యాణ్ ప్రజలకు దూరం. పార్టీ కార్యకర్తలకు దూరం. అభిమానులకూ దూరం. పార్టీ పెట్టి వారం రోజులు దాటింది. ఆవేశంతో కూడిన ఒక్క గంభీర ప్రసంగం తప్పితే ఏమీ లేదు. పవన్ కల్యాణ్ కేవలం సినిమా హీరో మాత్రమే కాదని, ఆయనకు సమాజం గురించి అవగాహన ఉందన్న విషయాన్ని అందరూ ఒప్పుకొంటారు. అయితే, ఎవరినో పాడు చేయడానికి పావుగా కాకుండా.. ప్రజలు, సమాజానికి సేవ చేసే రాజుగానే ఆయన రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: