ద్వారక పీఠాధిపతి! ప్రస్తుతం దేశాన్ని మోడీ మేనియా ఆవహించింది. ఇందులో ఎంత మాత్రం విశేషం లేదు. కాని, మోడీ మేనియా అటు కాంగ్రెస్ , కమ్యూనిస్టుల వంటి బీజీపి వ్యతిరేక వర్గాల్నే కాదు అద్వానీ, జశ్వంత్ సింగ్ లాంటి స్వంత గూటి పక్షుల్ని కూడా బ్బంది పెడుతోంది. ఇదంతా తెలిసిన విషయమే అయినప్పటికీ తాజాగా మోడీకి సరికొత్త కోణం నుంచీ వ్యతిరేకత ఎదురైంది! పైగా సదరు వ్యతిరేకి ఓ హిందు పీఠాధిపతి కావటం మరింత విశేషం.... ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా మోడీ అనే పేరు నినాదంలా మార్మోగుతోంది. ఇంతకాలం తాము సెక్యులరిస్టులమని చెప్పుకున్న వారు, మోడీ 2002 మారణకాండకి బాధ్యుడని అన్న వారు కూడా తెలివిగా తమ స్టాండ్ మార్చేస్తున్నారు. ఎల'క్షణాల్లో' అలాంటి జిమ్మిక్కులు తప్పటం లేదు మరి! మన రాష్ట్రంలోనే తీసుకుంటే ఎన్టీఆర్ తనయ, మాజీ కాంగ్రెస్ నేత పురంధేశ్వరి నమో మోడీ అనేసింది. తనను తాను విభిన్న రాజకీయ నాయకుడ్ని అని చెప్పుకునే జేపీ కూడా 'భిన్నత్వంలోనే ఏకత్వం' చూపాడు! బీజేపికి, మోడీకి నమో నమో అంటూ నమస్కరించాడు....ఇలా దేశమంతా తనకు తిరుగులేకుండా చేసుకుంటోన్న మోడీకి అనూహ్య కోణం నుంచి వ్యతిరేకత వచ్చి పడింది తాజాగా! ఎప్పుడూ మోడీకి, బీజీపికి మద్దుతుగా వుండే హిందు సన్యాసికి ఈసారి ఆగ్రహం కలిగింది. స్వంత రాష్ట్రం గుజరాత్లోని ద్వారక పీఠాధిపతి, శంకరాచార్య స్వరూపానంద సరస్వతి గుస్సా అయ్యారు. కారణం మోడీ పేరిట ప్రచారం అవుతోన్న నినాదమేనట! హర హర మహదేవ లాగా... హరహర మోడీ అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నారు బీజేపి అభిమానులు. వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిశాక ఈ నినాదం పుట్టుకొచ్చింది. కాకపోతే, ఇది వ్యక్తి పూజ కిందకు వస్తుందని ద్వారక పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇలాంటి పనులు హిందూ ధర్మానికి వ్యతిరేకమని ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కు ఫోన్ చేసి మరీ చెప్పారట. మోడీ కూడా తన పేరిట వస్తున్న ఈ 'విపరీత నినాదం' ఆపించే ప్రయత్నం చేయలేదని పీఠాధిపతి ఇంచుమించూ క్లాస్ తీసుకున్నారట! పీఠాధిపతి లెక్చరో.. ఆరెస్సెస్ చీఫ్ సలహానో... లేక స్వంతంగానే మోడీ జ్ఞానోదయం అయిందోగాని... ఎట్టకేలకు బీజేపి ప్రధాని అభ్యర్థి హరహర మోడీ నినాదం ఆపేయాలని ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు. అభిమానులు ఆపుతారో లేదుగాని... ఆల్రెడీ బీజేపి శివ గణాలకి మోడీనే మహాదేవుడని మాత్రం ప్రూవ్ అయిపోయింది!

మరింత సమాచారం తెలుసుకోండి: