ఓటు వేయండి, బహుమతులు గెలవండి! బంపర్ డ్రాలో నానో కారునే గెలుచుకోవచ్చు'... ఇది మెదక్ జిల్లా యంత్రాంగం అందుకున్న సరికొత్త నినాదం. ఓటర్లను పోలింగ్ బూత్ దిశగా కదిలించడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం. సార్వత్రిక ఎన్నికల్లో 90 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యేలా చూసి... జాతీయ స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ నమోదు కోసం మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సభర్వాల్ ఓటర్లకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. ఏదైనా గ్రామంలో 95 శాతం మంది ఓట్లు వేస్తే... ఆ ఊరిలోని పది మందికి 1200 రూపాయల విలువ చేసే ప్రత్యేక బహుమతులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 95 శాతం ఓటింగ్ నమోదైన గ్రామాల అభివృద్ధి కోసం కార్పొరేట్ల సామాజిక బాధ్యత నిధి నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. పోలింగ్ రోజున ఓటు వేసినట్లుగా వేలిపై ఇంకు ముద్ర చూపించిన ఓటర్లు లీటరు పెట్రోలుపై ఒక్కరూపాయి తగ్గింపు ఇచ్చేలా పెట్రోలు పంపుల యజమానులను ఒప్పించారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు వ్యవసాయ సబ్‌మెర్సిబుల్ పంపుసెట్, ఇన్వర్టర్లు, 220 లీటర్ల రిఫ్రిజిరేటర్లు, 32 ఇంచుల సామ్‌సంగ్ ఎల్ఈడీ టెలివిజన్లు, హోండా యాక్టివా స్కూటర్‌లను గెలుచుకునే అవకాశం కల్పించారు. మెదక్ జిల్లా పరిధిలో పరిశ్రమలు అధికంగా ఉన్న నేపథ్యంలో కార్మికులనూ పోలింగ్ బూత్ వైపు కదిలించేందుకు కలెక్టర్ స్మితా సభర్వాల్ ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఒక పరిశ్రమలోని కార్మికుల్లో 90 శాతానికిపైగా ఓటు హక్కు వినియోగించుకుంటే వారిలో 20 మందిని లక్కీ డ్రాద్వారా ఎంపిక చేసి రూ.5 వేల చొప్పున బహుమతి ఇస్తారు. పరిశ్రమ యాజమానిచేత సన్మానం కూడా ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతాలను క్లస్టరుగా విభజించి వాటిలో 90 శాతంపైగా పోలింగ్ నమోదైన కేంద్రాల నుంచి ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా ల్యాప్‌టాప్‌లు, వాషింగ్ మెషీన్లు, 220 లీటర్ల ఫ్రిజ్‌లు, మొదటి బహుమతిగా హోండా బైక్ లేదా హోండా యాక్టివా అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 90 శాతంకన్నా అధిక ఓటింగ్ సాధించిన బూత్‌లలో 20 మందికి ఎయిర్‌కూలర్లు, హెల్త్ చెకప్ కార్డులను అందించనున్నారు. ల్యాప్‌టాప్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లు, సామ్‌సంగ్ ఎల్ఈడీ టీవీ, బైక్‌లూ బహుమతిగా ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఓటు వేసిన అనంతరం తమ ఓటరు స్లిప్పులను పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్‌లో వేయాల్సి ఉంటుంది. 95 శాతం ఓటింగ్ సాధించిన గ్రామీణ ప్రాంతాలు, 90 శాతానికిపైగా పోలింగ్ బూత్‌లన్నింటికీ కలిపి బంపర్ డ్రా నిర్వహిస్తారు. ఇందులో గెలుపొందిన వారికి బంపర్ ప్రైజ్‌గా టాటా నానో కారు అందిస్తామని కలెక్టర్ స్మితా సభర్వాల్ ప్రకటించారు. మే 9న కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహిస్తామని, ఆ మరుసటి రోజే బహుమతులను అందిస్తామని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియకే కాదు...ఆ ఓటును ఉపయోగించుకున్న వారికి నజరానాలందించేందుకు మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ చూపిస్తున్న ఉత్సాహం ఆదర్శనీయం. ఓటింగ్ ను పెంచేందుకు ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతమందిని పోలింగ్ బూత్ వరకూ తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే....

మరింత సమాచారం తెలుసుకోండి: