తెలంగాణలో ప్రచారం ముగిసింది. మరో రోజు వ్యవధిలో తెలంగాణ ఓటరు తన తీర్పును వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఏమిటి... కనీసం సింగిల్ డిజిట్లో నైనా స్థానాలు సంపాదిస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చగా మిగిలింది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో వైకాపా తీసుకున్న స్టాండ్ ఫలితంగా ఆ పార్టీకి తెలంగాణలో క్యాడరే లేదనుకునే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో ఏకంగా 80 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది వైకాపా. అంతే కాదు కొన్ని చోట్ల గట్టిపోటీ ఇస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కూడా సీమాంధ్ర ప్రచారంలో తానే సీమాంద్రకు ముఖ్యమంత్రిని, కాని తెలంగాణ కూడా తనకు ముఖ్యమే అన్నారు. తన తండ్రి తెలంగాణకు ఎంతో చేసారంటున్నాడు. నిజానికి వైఎస్ అభిమానులు తెలంగాణాలోను ఉన్నమాట వాస్తవమే. అందువల్లనే షర్మిల సభలు అంతో ఇంతో విజయవంతమయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ అంతంత మాత్రంగానే ఉన్న చోట్ల తన పార్టీని గెలుపు దిశగా నడిపించాలన్న ఆలోచన జగన్ మాటల్లో వ్యక్తమయింది. తెలుగుదేశం మాదిరిగా తెలంగాణలో కూడా కాని చంద్రబాబు లాగా తను తెలంగాణలో ప్రచారానికి పోలేదు. మొదట్లో తెలంగాణ ఊసే ఎత్తలేదు. తర్వాత చెల్లెలు షర్మిలను తెలంగాణలో ప్రచారానికి దించారు. అంతే కాదు తెలంగాణలో కొన్ని చోట్ల మినహా మిగిలిన చోట్ల వైకాపా అభ్యర్థుల హడావిడి ఎక్కవగా కన్పించడంలేదు. ప్రధాన పోటీ ఉందన్న వాటి విషయంలో వైకాపా పేరు వినబడడంలేదు. అందుకే తెలంగాణలో వైకాపా ఏం సాధిస్తుంది. కనీసం సింగిల్ డిజిట్ పలితాలనైనా తన ఖాతాలో వేసుకుంటుందా అన్న వాఖ్యలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: