జూన్‌ 2... అప్పాయిటెడ్‌ డే! ఈ డేట్‌ దగ్గరపడే కొద్దీ ఎన్నో విషయాలపై రాష్ట్ర రాజకీయ, వాణిజ్య వర్గాలతో పాటూ అన్ని ప్రభుత్వ శాఖలు, సామాన్య ప్రజానీకంలో సైతం ఉత్కంఠత పెరిగిపోతూ వస్తోంది. ఏ రాష్ట్రంలో ఎవరు కీలక పదవుల్లోకి వస్తారు, ఎవరు తొలిగా పదవి పొందేవారిగా రాష్ట్రాలకు సంబంధించిన చరిత్రల్లో నిలిచిపోతారు... అంటూ ఒకటే ఊహాగానాలు. ప్రస్థుతం తెలంగాణాలో చర్చల్లో నానుతున్న పదవి తెలంగాణా రాష్ట్రానికి తొలి పోలీస్‌ బాస్‌! అప్పాయింటెడ్‌ డే అయిన జూన్ 2 వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అధికారికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోతుండడంతో కొత్త రాష్ట్రానికి పోలీస్ బాస్ ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డిజిపిగా ఉన్న ప్రసాదరావే ఆంధ్రప్రదేశ్‌కు డిజిపిగా కొనసాగుతారు. ఇక తెలంగాణ డిజిపి పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై అటు పోలీసు శాఖతోపాటు ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం 1979 బ్యాచ్ అధికారులకు తెలంగాణ తొలి డిజిపి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ రేసులో అరుణ బహుగుణ ముందున్నారు. ఈ ఐపీయస్‌ అధికారి హైదరాబాద్ వాసి కావడం కలిసొచ్చే అంశం. ప్రస్థుతం సెంట్రల్‌ డెప్యుటేషన్‌ లో నేషనల్‌ పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ గా ఉన్న అరుణ మరి ఈ పోలీస్‌ బాస్‌ పదవికి మొగ్గు చూపుతారా? అని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ప్రస్థుతం ఉమ్మడి రాష్ట్రానికి హోంశాఖ కార్యదర్శిగా ఉన్న టిపి దాస్‌, ఎస్‌ఏ హుడా అరుణ తరువాత రేసులో ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరూ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఐపీయస్‌ అధికారులు కావడం వల్ల పంపకాల్లో ఈ ఇద్దరిలో కేవలం ఒక్కరికే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం ఉంటుంది. తరువాత రేసులో ఉన్నవారిలో 1981 బ్యాచ్‌కు చెందిన అధికారులు దుర్గాప్రసాద్, వివేక్ దుబే, ఎకె ఖాన్, జెవి రాముడు ఉన్నారు. వీరంతా కూడా తమ రేంజుల్లో డిజిపి పదవి కోసం లాబీయింగ్‌ లు మొదలెట్టారని కూడా సమాచారం. అయితే వీరిలో ఎవరూ తెలంగాణకు చెందినవారు కాకపోవడంతో రేసులో ప్రస్థుత నగర కమీషనర్‌ అనురాగ్‌ శర్మ కూడా జాయిన్‌ అయ్యారట. అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌ నగరానికి అల్లుడు కావడం తనకు కలిసొచ్చే అంశం. సో... ఒకవేళ అరుణ బహుగుణ తెలంగాణా డిజిపి పదవి వద్దనుకుంటే తెలంగాణా తొలి పోలీస్‌ బాస్‌ గా అనురాగ్‌ శర్మకు అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా!!!

మరింత సమాచారం తెలుసుకోండి: