సీమాంధ్రులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. రాష్ట్రం విడిపోతే పోయింది.. గోల వదిలింది అని గతంలో అనుకున్నా.. ఇప్పుడు సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన సమయం వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ సీమాంధ్రకు అన్యాయం కొనసాగుతోంది. ఇందుకు వారిని తప్పుపట్టి ఉపయోగం ఉండదు. ప్రజలుగా మనమంతా ముందుకు రావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సీమాంధ్ర రాజధానిని ఎంత అద్భుతంగా నిర్మించాలి? దానిని ఎక్కడ నిర్మించాలి అనేది ప్రస్తుతం అసలు సమస్య కాదు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి విరాళాలు పోగు చేయడమూ ముఖ్యం కాదు. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడమే ఇప్పుడు అత్యంత కీలకం. రాజధాని నిర్మాణం అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చి సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని తెర వెనక్కి నెట్టేసే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండడమే ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. గురువారంనాడు తెలంగాణ బంద్ కు ఎందుకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, తెలంగాణకు ఉన్న ప్రధాన అభ్యంతరం ఏమిటి? పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన బిల్లులో, పార్లమెంటులో పెట్టినప్పుడు చెప్పని అభ్యంతరాన్ని ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు ఒక్కటే. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కనక కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని పూర్తి చేస్తుంది. అందులో అభ్యంతరం లేదు. కనక, దానిని అడ్డు పెట్టుకుని తెలంగాణకు ఇతర ప్రయోజనాలను జుర్రు కోవాలన్నదే కేసీఆర్ ఎత్తుగడ. ఇందులో భాగంగానే పోలవరాన్ని తీవ్రంగా వ్యతిరేకించి విద్యుత్తు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీలో లాభపడాలని చూస్తున్నారు. సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసింది. రాబోయే ఐదు దశాబ్దాల్లో కూడా కోలుకోలేని అన్యాయాన్ని ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం చేసింది. దాంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పది వేల కోట్ల రూపాయల లోటుతో తన ప్రస్థానాన్ని మొదలుపెడుతుంటే.. తెలంగాణ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల మిగులుతో ముందుకు దూసుకుపోతోంది. ఎనిమిది వేల కోట్ల రూపాయల మిగులు అంటే మాటలు కాదు. దేశంలోని పంజాబ్, హర్యానా సహా ఏ రాష్ట్రానికీ ఇంత మిగులు లేదంటే అతిశయోక్తి కాదు. ఇంత మిగులుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఎన్ని విన్యాసాలు అయినా చేయవచ్చు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వవచ్చు. ఎన్ని రుణ మాఫీలు అయినా ప్రకటించవచ్చు. దీనంతటికీ కారణం హైదరాబాద్ ను ఏకపక్షంగా తెలంగాణకు ఇచ్చేయడమే. వాస్తవానికి, గత ఐదు దశాబ్దాలుగా సీమాంధ్రులు తమ ఆస్తులను అన్నిటినీ హైదరాబాద్ లోనే పెట్టుబడులుగా పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ప్రతి ఒక్కరికీ పొలాలు ఉండేవి. వాటిని అమ్మేసుకుని హైదరాబాద్ లో పరిశ్రమలు పెట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని పెంచింది సీమాంధ్రులే. ఒకప్పుడు కొండలు, గుట్టలు, అడవులతో నిండిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని ఇప్పుడు దాదాపు 25 లక్షల కోట్లకు పెంచింది సీమాంధ్రులే. ప్రస్తుతం హైదరాబాద్ లో వసూలవుతున్న పన్నుల్లోనూ సింహ భాగం సీమాంధ్రులవే. కానీ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పన్నుల్లో సీమాంధ్రకు వాటా ఇవ్వలేదు. ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లూ ఇక్కడి ఆదాయాన్ని కనీసం రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఆలోచనను కూడా చేయలేదు. తెలంగాణలో నాలుగు సీట్లను సాధించుకోవాలన్న కక్కుర్తితో సీమాంధ్ర గొంతు కోసింది. దాంతో ఇప్పుడు సీమాంధ్ర దాదాపు 12 వేల కోట్ల రూపాయల లోటుతో ప్రస్థానాన్ని మొదలు పెట్టాల్సి వస్తే.. తెలంగాణ పది వేల కోట్ల రూపాయల మిగులుతో ఉంటోంది. దాదాపు 12 వేల కోట్ల రూపాయల కారణంగా సీమాంధ్రలో మొదటి నెలలోనే కనీసం ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇక మొదటి ఏడాదిలోనే జీతాలు, భత్యాలు కాకుండా రూ.17 వేల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి కాకుండా రాజధాని నిర్మాణానికి వెచ్చించాల్సి ఉంది. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు ఉండనే ఉన్నాయి. దీనికితోడు, అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఇచ్చిన హామీలే ఆయనకు సవాలుగా మారనున్నాయి. మరీ ముఖ్యంగా రైతుల రుణ మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ. ఈ రెండు పథకాలను అమలు చేయడానికి దాదాపు రూ.60 వేల కోట్లకుపైగా నిధులు కావాలనేది ఒక అంచనా. మొత్తంగా రుణాలను మాఫీ చేయాలంటే ఇది లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటికీ నిధులను ఖర్చు చేయాలంటే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేవాలి. ఒక పరిమితికి మించి అప్పులు చేయడమూ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో సీమాంధ్ర కష్టాల కడలిలో ఈదాల్సిన పరిస్థితి. రాష్ట్ర ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన విభజిస్తే ఏ గొడవా ఉండేది కాదు. హైదరాబాద్ ఆదాయం కూడా రెండు ప్రాంతాలకూ చెందేది. ఏ ప్రాంతమూ ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణతోపాటు సీమాంధ్ర కూడా అటు మిగులూ కాకుండా ఇటు లోటూ కాకుండా సమానమైన బడ్జెట్ ఉండేది. కానీ, సీమాంధ్ర మీద కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీ ఆదాయాన్ని పంచడానికి ససేమిరా అంది. అదే సమయంలో విద్యుత్తును మాత్రం ఇరు ప్రాంతాలకు వినియోగం ప్రాతిపదికన పంచేందుకు అంగీకరించింది. దీంతో, తొలుత తెలంగాణకు విద్యుత్తు కొరత ఉంటుందని అంచనాలు వేశారు. సీమాంధ్ర నుంచి కొనుక్కోక తప్పదని భావించారు. కానీ, ఇప్పుడు తెలంగాణకు విద్యుత్తు మిగులు ఉంటోంది. సీమాంధ్రకు విద్యుత్తు లోటు ఉండే పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఉద్యోగుల విషయంలో తెలంగాణ వాదులు తకరారు పెడుతున్నారు. మొత్తం ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించేయాలని అంటున్నారు. గత ఐదు దశాబ్దాలుగా ఇక్కడ సేవలు చేసిన ఉద్యోగులను తరిమేస్తున్నారు. మోస్ట్ థ్యాంక్ లెస్ ఫెలోలమని నిరూపించుకుంటున్నారు. ఈ సమయంలోనే సీమాంధ్రలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. తెలంగాణలోనూ టీడీపీ అధికారంలో ఉంది. కనక ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఆయన కొంత మెతకగా ఉండే అవకాశం ఉండొచ్చు. లేదా ఇప్పటి వరకు వ్యవహరించినట్లే టీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం నాయకులపై ఎదురు దాడి చేయవచ్చు. దానికి వాళ్లు లొంగిపోవచ్చు. దానికి మనం వాళ్లను తప్పుబట్టలేం. సీమాంధ్రులే ఇప్పుడు నిద్ర లేవాలి. హైదరాబాద్ ఆస్తులు, విద్యుత్తు, ఉద్యోగులు తదితర వ్యవహారాల్లో పోరాడాల్సిన సమయం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: