కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో ఎవరు ఉన్నా.. దేశానికి ఇప్పుడు వచ్చే సమస్య ఏమీ లేదు. కనీసం అధికార పార్టీ కూడా కాదు కాబట్టి... సోనియాగాంధీ అధ్యక్ష పదవిలో ఉన్నా... రాహుల్ గాంధీ కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా... గాంధీల కుటుంబం నుంచి గాక కొత్త వ్యక్తి వచ్చి అధ్యక్ష పదవి ని చేపట్టినా... దేశ జనులకు వచ్చే నష్టం ఏ మాత్రమూ లేదు! అయితే కాంగ్రెస్ లోని నేతలు మాత్రం... తమ పార్టీ అధినాయకత్వం గురించి మీడియా ముందు చర్చించడానికి ఇష్టపడుతున్నారు. అంతిమంగా అందరూ సోనియా, రాహుల్ లపై తమ అభిమానాన్ని చాటుకొంటున్నా... సోనియానే అధ్యక్షురాలిగా ఉండాలని కొందరు, కాదు రాహుల్ బాధ్యతలు స్వీకరించాలని మరొకరు... ఇద్దరూ కాదు ప్రియాంక కావాలని ఇంకొందరు... కాంగ్రెస్ లో ఎవరైనా అధ్యక్షులు కావొచ్చని.. అయితే ఆ అవసరం మాత్రం ఇప్పుడు లేదని... ఇంకొకరు... ఈ విధంగా వాదించుకొంటున్నారు. దిగ్విజయ్ సింగ్ ఏమో రాహుల్ బాధ్యతలు స్వీకరించాలని అంటాడు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రియాంక బాధ్యతలు స్వీకరించాలనే డిమాండ్ వినిపించింది. వీటన్నింటికీ భిన్నంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కాంగ్రెస్ కు గాంధీల కుటుంబం నుంచి గాక.. కొత్త వారెవరెవరైనా అధ్యక్షులు అయ్యే అవకాశాలు లేకపోలేదని అన్నాడు. అయితే తాజాగా షిండే తెరపైకి వచ్చాడు! కాంగ్రెస్ అధినాయకత్వం మారాల్సిన అవసరం లేదని షిండే స్పష్టం చేస్తున్నాడు. గెలుపోటమలు సహజమేనని.. అంత మాత్రానికే నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వ్యక్తి మారాల్సిన అవసరం ఏముందని? షిండే ప్రశ్నిస్తున్నాడు! మొత్తానికి కాంగ్రెస్ నేతలు తలా ఒక వాదనతో.. ఈ వ్యవహారాన్ని రక్తి కట్టిస్తున్నారు. చివరకు ఏం తేలుస్తారో!

మరింత సమాచారం తెలుసుకోండి: