బీరు మరింత ప్రియం కానున్నది. ముడి సరుకు ధరలు, ఉత్పత్తి వ్యయం పెరుగుదల తదితర కారణాల రీత్యా తమకు నష్టం వాటిల్లుతున్నదని, వాటి కనీస ధరలు పెంచాలని చాలాకాలంగా బ్రేవరేజీ సంస్థల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే బీర్ల ధర పెంపునకు ఏర్పాటైన టెండర్ల కమిటీ 35 శాతం వరకు పెంచవచ్చునని సిఫార్సు చేసినా.. తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఫలితంగా మరోసారి టెండర్ల కమిటీ 25 శాతం పెంచవచ్చునని ప్రతిపాదించింది. అయినప్పటికీ ప్రభుత్వం 20 శాతం ధరల పెంపునకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో బీరు బాటిల్ ధర రూ.90 నుంచి రూ.120 వరకు పలుకుతున్నది. ధరలు పెరిగితే ఒక్కో బాటిల్ ధర రూ.100 నుంచి రూ.120, రూ.140 వరకు చేరుకుంటుందని చెప్తున్నారు. ఏటా తెలంగాణ రాష్ట్రంలో 4.80 కోట్ల బీర్లు అమ్ముడవుతున్నాయని అంచనా. దీని ప్రకారం బీరు ప్రియులపై రూ.500 కోట్ల అదనపు భారం పడనున్నది. వేసవిలో సాధారణంగా బీర్ల కొరత ఉండడం వల్ల మద్యం దుకాణాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్త్తుంటాయి. పెరుగనున్న ధరలతో వచ్చే వేసవిలో బీరు ప్రియులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: