కృష్ణానదిలో ఆక్రమణల తొలగింపు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ప్రకాశం బ్యారేజీ ఎగువున నదికిరువైపులా అటవీ, నదీ పరీవాహక చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే యత్నాలు మొదలయ్యాయి. బీజేపీ-టీడీపీల మధ్య ఆధిపత్య పోరుకు కృష్ణా తీరంలో ఆక్రమణల వ్యవహారం ఆజ్యం పోసింది. రాజధానిగా ప్రకాశం బ్యారేజీ ఎగువున ఉన్న తుళ్లూరు మండలాన్నిఎంపిక చేయడం., కృష్ణా కరకట్టల వెంబడి భారీ ఎత్తున నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయానికి రావడంతో వాటిని అడ్డుకునే యత్నాలు మొదలయ్యాయి. బీజేపీ-టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పట్టు సాధించుకునే క్రమంలో అసలు విషయం మరుగున పడే పరిస్థితి తలెత్తింది. బ్యారేజీ తూర్పు లాకుల నుంచి వెంకటపాలెం వరకు ఉన్న భూముల్లో ప్రముఖుల స్థలాలు, ఫాం హౌస్ లు ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు పెద్ద తలకాయలన్ని ఒక్కటయ్యాయి. కృష్ణా నదికిరువైపులా గుంటూరు జిల్లా పరిధిలో 45అక్రమ కట్టడాలుండగా., కృష్ణా జిల్లా పరిధిలో 15కట్టడాలను ప్రాథమికంగా గుర్తించారు. రెవిన్యూ సిబ్బంది నుంచి నీటిపారుదల సిబ్బందికి సరైన సహకారం లభించకపోవడంతో గూగుల్ మ్యాప్ ల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించే పనిలో పడ్డారు. దీంతో ఈ భూముల్ని రక్షించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. కృష్ణా తీరంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఎకరం స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. నది ఒడ్డున వాస్తు రీత్యా కూడా కార్యాలయం అనుకూలంగా ఉంటుందని బీజేపీ అగ్రనేతలు భావించడంతో ఈ ప్రాంతంలో నిర్మాణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే అక్రమకట్టడాలపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా మృగ్యమవుతాయి. ఈ వ్యవహారం నీటి పారుదల శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: