తమకు కార్పొరేట్ మీడియా సహకరించడం లేదని అరోపిస్తున్నారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. అందుకే సొంతంగా మీడియా శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వారు చెప్పుకొచ్చారు. త్వరలో తెలుగులో మరో 24 గంటల వార్తా ఛానల్ ను ప్రారంభించనున్నట్టుగా సీపీఎం నేతలు ప్రకటించారు.

ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకూ చెరో వార్తా ఛానల్ ఉన్నాయి. కొంతకాలం కిందట ఈ రెండు పార్టీలూ ఛానళ్లను ప్రారంభించుకొన్నాయి. అయితే ఇప్పుడు మరో ఛానల్ రానున్నదట. ఇది ఆంధ్రకు ప్రత్యేకమైనదని సీపీఎం ప్రకటించింది. ప్రస్తుతం తమ పార్టీకి ఉన్న ఛానల్ ను తెలంగాణపై ఫోకస్ పెట్టేలా చూసి.. రెండో ఛానల్ ను ఆంధ్ర కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగా సీపీఎం ప్రకటించింది.

మరి ఇలా ఛానళ్లను పెంచుకొని వీరు సాధించేదేమిటో అర్థం కావడం లేదు. కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి దేశ వ్యాప్తంగా ఏమంత బాగోలేదు. దీనికి సవాలక్ష కారణాలున్నాయి. ఒకవైపు నిన్నలా మొన్న పుట్టుకొచ్చిన ఆప్ సంచలనాలు నమోదు చేస్తుంటే.. ఎన్నో ఏళ్ల పోరాటం అని చెప్పే కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆప్ తరహా సక్సెస్ ను ఒక్క రాష్ట్రంలోనైనా సాధించలేకపోతున్నారు.

అసలు కమ్యూనిస్టు పార్టీల భవితవ్యం ఏమిటో కూడా అర్థం కావడం లేదు. ఈ దశలో కొంచెం కొత్త తరహాలో.. త్రికరణ శుద్ధితో జనాల్లోకి వెళ్లాల్సిన కమ్యూనిస్టు పార్టీలు మీడియా శక్తిని పెంచుకోవడం మీదనే దృష్టి సారించారు. బెంగాల్ , కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలకు సొంతంగా టీవీ ఛానళ్లున్నాయి. మరి ఏపీ, తెలంగాణల్లో కూడా ఆ ముచ్చ తీర్చుకొంటున్నారు. వీటి వల్ల ప్రయోజనాలు ఏ మేరకు ఉంటాయో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: