ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించింది ఏ రకంగా చూసినా అద్భుత విజయం. మొత్తం 70 స్థానాల్లో 3 మినహా అన్నీ ఒక్క పార్టీకే దక్కటం భారత ఎన్నికల చరిత్రలో అపూర్వం... అపురూపం. ఇందిర హత్యానంతరం సానుభూతి వెల్లువలో అఖండ విజయం సాధించిన రాజీవ్‌గాంధికి కూడా ఈ స్థాయిలో 95 శాతం సీట్లు దక్కలేదు. గట్టి పోటీదారు అంటూ రంగంలో ఏ పార్టీ లేనప్పుడు ప్రధాన రాజకీయ శక్తికే ఓట్లన్నీ ఏకపక్షంగా పడటం అబ్బురం కాదు. కాని ఈసారి ఢిల్లీ బరిలో జరిగింది హోరాహోరీ పోటీ. పుట్టి మూడేళ్లు కాని ‘ఆప్’కు ప్రతిద్వంద్విగా నిలిచింది ఎనిమిది నెలల కిందటే ఢిల్లీలోని అన్ని లోక్‌సభ స్థానాలనూ నిశే్శషంగా గెలిచి, దేశమంతటా సగర్వంగా జయకేతనం ఎగరేసిన భారతీయ జనతాపార్టీ. నరేంద్రమోదీ అంతటి మహాయోధుడు, దేశాధినేత స్వయంగా ప్రచార గోదాలోకి దిగి, సర్వశక్తులూ ఒడ్డి పోరాడాడు. అయనా అరవింద్ కేజ్రీవాల్ అనే పిట్టంత మనిషికి అధికారం అందకుండా అడ్డుకోలేకపోవటం మాట అలా ఉంచి, సొంత పార్టీకి ఘోరపరాభవాన్ని తప్పించలేకపోయాడు.

ఒక పార్టీ మీద వ్యతిరేకతే ఇంకో పార్టీకి, అనుకూలతగా మారటం, తమ ప్రయోజకత్వం వల్ల కాక ఎదిరి పక్షం అప్రయోజకత్వం మూలంగా ఒక పార్టీ లేదా కూటమి ఊహించని జాక్‌పాట్ కొట్టటం రివాజు. కేజ్రీవాల్‌కు అధికారం సిద్ధిస్తున్నది అలాంటి నెగిటివ్ వోటువల్ల కాదు. ఐదేళ్ల పూర్తికాలం అతడు మాత్రమే అధికారంలో ఉండదగ్గవాడన్న నమ్మకంతోటే... మునుపటి వలె బొటాబొటి మెజారిటీకీ గతిలేని స్థితిలో ఇబ్బంది పడకుండా అతడు సుస్థిర పాలన అందించాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీ ఓటర్లు ‘ఆప్’ మీద అవ్యాజాదరణ చూపించారు. అందివచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోలేక, 49 రోజులకే కాడికింద పారేసి పారిపోయాడని కేజ్రీవాల్ మీద ఎవరు ఎంత దుమ్మెత్తి పోస్తేనేమి? ఇతర రాజకీయ శాల్తీల్లా పవరు కోసం పాకులాడి, కనీస బలం పుంజుకునేందుకు అనైతిక బేరాలు కుదుర్చుకోకుండా, లాలూచీలు పడకుండా అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడన్న సానుభూతి ఓటర్ల మీద పని చేసింది. అతడు రాజ్యమేలిన 49 రోజుల్లో లంచగొండి అధికారులు తమ తెరువు రాకుండా అడ్డుకున్నాడనీ, అతడు పోగానే మళ్లీ మామూళ్ల పీడ బారిన పడ్డామని ఢిల్లీలో అరకోటికి పైగా ఉన్న చిన్నాచితకా వీధి బండి వ్యాపారులూ, మురికివాడల బడుగు జీవుల్లో గూడుకట్టిన ఆదరభావం కేజ్రీ దిగ్విజయానికి సోపానమైంది. ఆమ్‌ఆద్మీ పార్టీ తప్పక గెలుస్తుంది అని అందరూ అనుకున్నదే. ‘స్పెషలార్డరు’ మీద వండించిన సర్వేలను మినహాయిస్తే అన్ని ఒపీనియన్ పోల్సులోనూ ఆప్ ఆధిక్యం ప్రస్ఫుటమైనదే. కాని ఈ స్థాయిలో కనీవినీ ఎరుగని బ్రహ్మాండ విజయాన్ని కేజ్రీవాల్‌గాని, అతడి పార్టీవారు గాని, హంగుదారులు కాని కలనైనా ఊహించి ఉండరు. మీడియా సర్వేలు పసికట్టకలిగిన దానికంటే అన్ని అంచనాలనూ మించి ఇటువంటి ఘనాధిక్యం లభించటం పూర్తిగా కేజ్రీ అండ్ పార్టీ ప్రతాపం వల్లే అని చెప్పటం సరికాదు. పరిస్థితులూ బాగా కలిసి వచ్చాయి. కమలం కంటే మూడు సీట్లు తక్కువగా ఆప్‌కు రెండోస్థానం దక్కిన 2013 డిసెంబర్ ఎన్నికల్లో జరిగింది ముక్కోణపు పోటీ. అప్పుడు ప్రతిపక్షాలు ధ్వజమెత్తింది కాంగ్రెసు అవినీతిపాలన మీద. ఆ కాంగ్రెసు కాస్తా నిరుటి జాతీయ ఎన్నికల దరిమిలా నడుము విరిగి, మాడు పగిలి, మళ్లీ కోలుకునే ఆశ లేకుండా మూలన పడింది. కిందటిసారి దానికి పడిన బిజెపి వ్యతిరేక ఓట్లన్నీ ఈమారు గెలిచే అవకాశం ఉన్న ఆమ్ ఆద్మీలకు పడ్డాయి. అలా కాంగ్రెసు మరణం ‘ఆప్’కు అమృతమైంది. దానికి మించి అధికారాన్ని బంగారపు పళ్లెంలో పెట్టి కేజ్రీవాల్‌కు సమర్పించడానికి ప్రధాన వైరి బిజెపి అందించిన భూరి సహాయమూ అంతింత కాదు. తన అనూహ్య, అద్భుత విజయానికి ఆప్ ఆసామీ మొట్టమొదట కృతజ్ఞత తెలపవలసింది కన్నుగానని కమలనాధులకే.

మంచివాడు మంచివాడంటే మంచమెక్కి గంతులేశాడని సామెత. గొప్పవాడు గొప్పవాడు అంటే అమిత్‌షా కూడా కుప్పిగంతులు వేసి ఢిల్లీ బిజెపిని కుప్పకూల్చాడు. మహామహా పార్లమెంటు ఎన్నికలలోనే అందరూ దిమ్మెరపోయేలా దుమ్ములేపేసిన వాళ్లం... పులిలాంటి శివసేననే పిల్లిని చేసి ఆటాడించిన వాళ్లం... రాష్ట్రాల ఎన్నికల్లో వరసగా తడాఖా చూపిస్తున్న వాళ్లం ఆఫ్టరాల్ ఒక ఢిల్లీ నగర రాష్ట్రాన్ని కళ్లు మూసుకుని ఎడమ చేత్తో గెలవలేమా అన్న ధీమా కమలం శిబిరం కొంప ముంచింది. ఇతర రాష్ట్రాలలో వలె ప్రత్యేకంగా ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా మోదీ పేరు ఫలంతో ఢిల్లీలోనూ సునాయాసంగా నెగ్గగలమన్న అతి విశ్వాసంతో ఆదమరచి, తొలుత విలువైన కాలాన్ని వృథా చేశారు. కేజ్రీవాల్ దుర్నిరీక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి అంతుబట్టాక, అతడికి దీటైన ప్రత్యామ్నాయంగా తామూ ఒకరిని చూపించక తప్పదని అర్థమైంది. అప్పుడైనా తెలివిగా అడుగువేశారా? చాలాకాలంగా పార్టీని నమ్ముకుని, మచ్చలేని నిజాయితీ పరుడుగా పేరుతెచ్చుకుని, కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ప్రథమస్థానంలో నిలబెట్టగలిగిన స్థానిక నాయకుడు డాక్టర్ హర్షవర్ధన్ మీద పందెం కాశారా? ఆ పాతకాపు పనికిరానివాడని పక్కకునెట్టి, ఆమ్‌ఆద్మీ గోత్రానికి చెందిన ‘టీమ్ అన్నా’ మెంబరు కిరణ్‌బేడీని కష్టపడి పట్టుకుని ఆఖరి నిమిషంలో కమల తీర్థం ఇచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో చెలరేగి విజృంభించాల్సిన తరుణంలో బిజెపి శ్రేణులను నీరసం ఆవహించింది. నిర్లిప్తత పెరిగింది. నడమంత్రపు ఫిరాయింపుదారును సహాయ నిరాకరణతో నిస్తేజం చేసి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసీ కార్యకర్తల్లో, సీనియర్ నాయకుల్లో పెరిగింది. తమ వ్యూహం బెడిసికొట్టిందని, పారాచూట్‌తో యుద్ధరంగంలోకి దిగబడిన బేడీ మొగాన గెలిచే కళ లేదని అర్థమయ్యాకయినా పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించి, ప్రాప్తకాలజ్ఞత చూపితే పై వాళ్లకు కనీసం పరువు దక్కేది. కాని, ఢిల్లీని గెలవటం మోదీ దక్షతకు అగ్ని పరీక్ష, బిజెపి రాజకీయ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్య అయినట్టు కంగారుపడి, ఏకంగా దేశాధినేతనే ఒక బుల్లి రాష్ట్రం ఎన్నికల బరిలోకి దించారు. గల్లీ గల్లీకి తిప్పి, కేజ్రీవాల్‌ను తిట్టించారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మీడియాలో భారీ ప్రకటనలు గుప్పించి ఈ ఎన్నికలు మోదీ ఇజ్జత్‌కు సవాల్ అన్న అభిప్రాయాన్ని కలిగించారు. నూట ఇరవై మంది ఎంపీ, ఎమ్మెల్యేలనూ, కేంద్రమంత్రి మండలి వస్తాదులనూ రంగంలో మోహరించి భూతద్దాలతో రంధ్రానే్వషణ చేసి కేజ్రీవాల్ మీద ఆరోపణల బండలు వేసేకొద్దీ మొదటే అతడి వైపు మొగ్గిన ఓటర్లకు అతడిమీద సానుభూతి పెరిగింది. దేశానే్నలేవారు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేసే కొద్దీ ప్రజల మనసులో అది కేజ్రీవాల్‌కు పాజిటివ్ అయింది. కాబోయే ముఖ్యమంత్రిగా ఏరికోరి నిలబెట్టిన మహిళామణి ఇరవై ఏళ్లుగా బిజెపికి కంచుకోట అయిన చోటే కనీసం ఎమ్మెల్యేగా గెలవలేక చిత్తుగా ఓడటం ఒక విధంగా దగాపడిన పార్టీ శ్రేణుల తీపి ప్రతీకారం!

అరవింద్ కేజ్రీవాల్ తన స్థాయి, స్థానం మరచి లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ మీద కాశీలో కాలుదువ్వితే ఓటర్లు కాళ్లు విరగగొట్టారు. ఆ నరేంద్రమోదీయే వచ్చి, రాష్ట్ర ఎన్నికల్లో తన స్థాయిని మరచి తలదూర్చినా లక్ష్యపెట్టక ఓటర్లు మళ్లీ అదే కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిగా వరించారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని స్థానాలనూ కమలానికి కట్టబెట్టిన ఢిల్లీ వాసులే రాష్ట్ర ఎన్నికల్లో కమలాన్ని కాదని చీపురును ఎంచుకున్నారు. ఎన్నికలను, నాయకులను ఎలా చూడాలో అలా చూసి, సందర్భానికి తగ్గట్టు సరైన నిర్ణయం చేయడంలో మన ఓటర్ల పరిణతికి ఇది గొప్ప నిదర్శనం. రాష్ట్ర ఎన్నికల్లో మోదీ మాటను కాదని ‘పాంచ్‌సాల్ కేజ్రీవాల్’ అని ఎలుగెత్తి చాటినంత మాత్రాన ఢిల్లీ ఓటర్లు మోదీ నాయకత్వాన్ని తిరస్కరించారనటం తప్పు. జాతీయస్థాయిలో మోదీకి ప్రజాదరణ తగ్గిందని దీన్నిబట్టి తేల్చటం తొందరపాటు. తమ తాహతును అతిగా ఊహించుకుని, ఎన్నికల వరస విజయాలతో తలవాచి, పార్టీ కార్యకర్తలనూ ఆది నుంచీ పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లనూ లెక్కచేయక, తామే సర్వజ్ఞులమనుకుని, తప్పుమీద తప్పు చేస్తున్న కమలనాధుల మిడిసిపాటుకు మాత్రం ఢిల్లీ ఫలితాలు చెంపపెట్టు. తమది తేడాగల పార్టీ అని, తమ ఇంటి పేరు నీతి వారని, క్రమశిక్షణకు తమ పార్టీ కేరాఫ్ అడ్రసు అని చెప్పుకునే వారు ఒక చిన్న రాష్ట్రంలో ఎన్నికల వైతరణిని దాటటం కోసం ఎంతగా విధంచెడ్డా ఫలం దక్కకపోవటం ఒకరకంగా బిజెపీకీ మంచిదే. ఢిల్లీ ఓటర్లు వేసిన మొట్టికాయ తరవాతయనా అగ్రనేతల కళ్లు కిందికి దిగి, ఆత్మ విమర్శ మొదలైతే ఢిల్లీ శృంగభంగం సార్థకమైనట్టే. ఒక కల కనగానే తెల్లవారిపోనట్టు ఎన్నికలు గెలవగానే సరిపోదు. ప్రజలు తన మీద కనపరచిన అపార విశ్వాసాన్ని బాధ్యతాయుతమైన చేతల ద్వారా కేజ్రీవాల్ నిలబెట్టుకోవాలి. 49 రోజుల ప్రహసనంలోలాగే పిల్లచేష్టలను, దుడుకు పోకడను ఇక ముందు కొనసాగిస్తే ఇప్పుడు బిజెపిని ఊడ్చేసిన ఓటు చీపురే రేపు చీపురు పార్టీనీ ఊడ్చేయగలదు. తస్మాత్ జాగ్రత.

మరింత సమాచారం తెలుసుకోండి: