అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్ ఇకపై ఢిల్లీలోనే విచారణ ఎదుర్కోబోతున్నారా? చంచల్ గూడ జైలు నుంచి జగన్ విచారణ ఢిల్లీకి మారనుందా..? ఈడీ నోటీసుల నేపధ్యంలో ఈ అంశం పై చర్చ జరుగుతోంది. ఈడీ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉన్నందున ఆయనను అక్కడికే తీసుకు వెళ్లి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ తరలింపునకు ప్రిజనర్ ట్రాన్స్ ఫర్ కోసం ఈడీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జగన్ కు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమ ఎదుట ఈనెల 17వ తేదిన హాజరు కావాలని ఈడి అప్పీలేట్ అథారిటీ జగన్‌ను ఆదేశించింది. జగన్‌తో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. జగన్‌ను ముగ్గురు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన బృందం ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు ఈడి నోటీసులు పంపించిన నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలు నుంచి తీహార్ జైలుకు తరలించే అవకాశాలపై తర్జన భర్జన జరుగుతోంది. జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని ఇప్పటికే ఈడి ప్రశ్నించింది. ఆయన నుండి పలు కీలక పత్రాలను తీసుకుంది. విజయసాయిరెడ్డి జవాబులతో సంతృప్తి చెందని ఈడీ ఈనెల 20న విచారణకు హాజరకావాలని ఆయన్ను ఆదేశించింది. వైయస్ జగన్ కేసులో మరో విడత ఆస్తులు జప్తు చేయడానికి ఈడి రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడి ఇప్పటికే 52 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. దీంతో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఆందోళన మొదలైంది. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్‌ను ఢిల్లీకి తీసుకు వెళ్లి విచారించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. సుప్రీం కోర్టులో బెయిల్ నిరాకరించటం, బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకోవడానికి గడువు కూడా మరో నాలుగైదు నెలలు ఉండటంతో ఇప్పటికే జగన్ శిబిరంలో తీవ్ర నిరుత్సాహం కనబడుతోంది. మరోవైపు సిబిఐ మార్చి నెలాఖరు వరకు కేసును ముగించని పక్షంలో జగన్‌కు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి నుండే ఈడి దూకుడుగా వ్యవహరిస్తే.. తీరా బెయిల్ పిటిషన్ కోరే సమయానికి జగన్ మరింత ఇబ్బందులో పడే అవకాశముందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంచల్ గూడ నుంచి తీహార్ జైలుకు తరలించటానికి సంబంధించి ప్రిజనర్ ట్రాన్స్ ఫర్ కోసం ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈడీ ఢిల్లీలోనే జగన్ ను విచారించాలని నిర్ణయిస్తే ప్రిజనర్ ట్రాన్స్ ఫర్ కు సీబీఐ కోర్టు నుండి అనుమతి తీసుకోవలసి ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో రాజీ ప్రయత్నాలు సాగుతున్నాయని బయట ఊహాగానాలు వినిపిస్తున్నా ఈడీ తన పని తాను చేసుకుపోతుండడంతో అసలు జగన్ ఈ కేసుల నుంచి బయటపడతాడా? లేదా? అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: