వర్షాలు వచ్చే సమయానికే మరమ్మతు కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవాలి. చెరువులకు ఆధారమైన కాలువలు సరిగా ఉన్నాయా.. చెరువుల్లో పూడిక తీత అవసరం ఉందా? అనే అంశాల గురించి సమీక్షించి పనులు పూర్తి చేసుకోవాలి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా.. ప్రారంభించకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. తెలంగాణలోని గ్రామాల్లో చెరువులన్నింటినీ పునరుద్ధరించి.. అవసరమైన మరమ్మతులు చేసి.. తీర్చిదిద్దాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు భారీ ప్రణాళికను రూపొందించారు. మరి ప్రణాళిక వరకూ బాగానే ఉంది. అయితే అది అమలు మాత్రం జరగడం లేదు. ఏకంగా తొమ్మిది వేల చెరువును తీర్చిదిద్దుతామని ప్రకటించారు కానీ.. అసలు వీరు ఈ కార్యక్రమంలో ఏ మేరకు విజయవంతం అవుతారు? అనేది సందేహంగా మారింది.

వర్షాకాలం ఎంతో దూరంలో లేదు. అంతలోపే చెరువులను మరమ్మతు చేయాలి. లేట్ అయ్యిదంటే ఉపయోగం ఉండదు. వర్షాలు వస్తే చెరువులు బురదమయం అవుతాయి. అప్పుడు పూడిక తీత అనేది అసాధ్యం. అలాగే కాలువల రిపేర్లు కూడా వర్షాల రాకమునుపే అయిపోవాలి.

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ మిషన్ కాకతీయను మొదలు పెట్టనే లేదు! ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియడం లేదు. దీంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందా? అనే సందేహాలు జనిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించుకొని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోతే.. తెలంగాణ ప్రభుత్వానికి అంతకుమించిన అవమానం ఉండదేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: