సామాన్య ప్రజలకు లభించకపోవడం వివిధ సామాజిక వైపరీత్యాలకు ప్రధాన కారణం బడులలో మధ్యాహ్న భోజన పథకం ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్న భావం కలగడం వర్తమాన వైపరీత్యాలలో ఒకటి ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులలో భారీ కోత ఏర్పడి పోయిందన్నది జరుగుతున్న ప్రచారం కేంద్ర ప్రభుత్వం వారి నగదు బదిలీ పథకం కింద విద్యార్థుల బ్యాంకు ఖాతాలలోకి సహాయం బదిలీ అవుతోందన్నది బడ్జెట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట పాఠశాల విద్యకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు వర్తమాన ఆర్థిక సంవత్సరంలోకంటే 2015-2016వ ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోయాయట అందువల్ల పాఠశాల విద్యకు రాష్ట్రాలు మరింత ఎక్కువ నిధులు సమకూర్చాలన్నది కొత్త బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ధారణ ఉన్నత విద్యకు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులు పెరిగాయట అయితే నగదు బదిలీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం వారి సహాయం పొందుతున్న విద్యార్థులు ఏ స్థాయి వారు? వారి ఖాతాలకు బదిలీ అవుతున్న సహాయం స్వభావం ఏమిటి? అన్నది స్పష్టంగా తెలియడం లేదు

ఈ బదిలీ కేంద్ర ప్రభుత్వం నిర్వహణలోని విద్యా సంస్థల విద్యార్థులకు మాత్రమే లభిస్తోందా? లేక దేశం మొత్తంమీద ఉన్నతోన్నత విద్యనభ్యసిస్తున్న అర్హులైన వారందరికీ లభిస్తోందా? తల్లిదండ్రులకు ఒకే బిడ్డ ఉన్నట్టయితే ఆ బిడ్డ ఆడపిల్ల అయినట్టయితే ఆ పాప ఉన్నత విద్యార్జన కోసం అయ్యే ఖర్చును మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించే పథకం దశాబ్దం క్రితమే మొదలైంది. ఆ పథకం ఇప్పుడు అమలు జరుగుతోందా లేదా అన్న స్పష్టమైన సమాచారం లేదు! కార్పొరేట్ రంగంలోని విద్యా సంస్థలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారికి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. తిరిగి చెల్లించే-రీ ఇంబర్స్‌మెంట్-ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడ నిధులను సమకూర్చుతోందా? సమకూర్చినట్టయితే దీన్ని కూడ నగదు బదిలీతో అనుసంధానం చేశారా? కేంద్రం వారి కొత్త బడ్జెట్ తరువాత విద్యా వ్యవస్థలోని అనేక విభాగాలకు సంబంధించిన నిధులు కేటాయింపుపై గందరగోళం నెలకొని ఉంది! పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను దాదాపు రద్దు చేసిందన్న ప్రచారానికి ఈ గందరగోళం కారణం! రాష్ట్రాలు అమలు జరుపుతున్న ఎనిమిది పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వడం పూర్తిగా రద్దుచేయడం కొత్త బడ్జెట్ విశేషం! అయితే ఇలా కేంద్రం నిధులివ్వడం మానుకున్న ఎనిమిది పథకాలలో బడి భోజనం పథకం లేదు! అందువల్ల కేంద్ర ప్రభుత్వ సహాయం బడి భోజనానికి కొనసాగుతునే ఉంది! మరి మధ్యాహ్న భోజన పథకానికి భారీగా నిధుల కోతను ఎందుకని విధించినట్టు? వర్తమాన సంవత్సరంలో బడి భోజనానికి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం ఏప్రిల్ ఒకటవ తేదీనుండి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో కేవలం నూట ముప్పయిరెండు కోట్లను కేటాయించినట్టు మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది! అంటే ప్రస్తుతం లభిస్తున్న కేంద్ర నిధులలో పదవ వంతు మాత్రమే ఇకపై లభిస్తాయా? నిధులను తగ్గించడం పెంచడం సర్వసాధారణ ఆర్థిక అంశం. కానీ వంద రూపాయలు విడుదల చేయవలసిన పథకానికి పది రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం విస్మయకరమైన పరిణామం! జాతీయ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ప్రభుత్వం వసూలు చేస్తున్న ఉమ్మడి పన్నులలో రాష్ట్రాల వాటా పెంచారు. ముప్పయి రెండు శాతం నుండి నలబయి రెండు శాతానికి రాష్ట్రాల వాటా పెరిగింది! అందువల్ల ఉమ్మడి పథకాలలో రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం పెరగాలన్నది కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ధారణ! ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కొనడం అంటే ఇదేమరి! ఆర్థిక వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రాలకు అధికారం పెంచాలన్న సమాఖ్య -ఫెడరల్-స్ఫూర్తి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారాన్ని పెంచింది! పాలనాపరంగా యథాతథ స్థితి ఏర్పడిపోయినప్పటికీ రాజకీయంగా ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వాహకుల మతిమాలిన చర్య! పన్నులలో రాష్ట్రాలవాటాను పెంచడానికి ప్రజలలో గుర్తింపులేదు, బడి భోజనంవంటి సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఘోరంగా తగ్గిస్తోందన్నది మాత్రమే ప్రజలకు లభిస్తున్న స మాచారం! కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీకి ప్రజలలో పలుకుబడి తగ్గడానికి ఈ నిధుల కోత దోహదం చేస్తుం ది!

పన్నుల వాటా పెరిగినందువల్ల మధ్యాహ్న భోజన పథకానికి రాష్ట్రాలు ఎక్కువ శాతం నిధులు భరించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో తర్కం ఉండవచ్చు, న్యాయం లేదు! ఎందుకంటే పన్నుల వాటా పెరగడంవల్ల వచ్చే అదనపు రాబడిని మొత్తం మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించవలసిన అనివార్యం రాష్ట్రాలకు ఏర్పడుతుంది! మిగిలిన సంక్షేమ పథకాల మాటేమిటి? అంగన్‌వాడీ కేంద్రాలలోని భోజన పథకానికి పాఠశాలలలోని మధ్యాహ్న భోజన పథకంతో సంబంధం లేదు. ఈ పథకానికి కూడ కేంద్రం నిధులలో కోత విధించారా? ఎందుకంటే అనేక అంగన్‌వాడీ కేంద్రాలకు లభిస్తున్న సరఫరాలు గత రెండు మూడునెలలుగా తగ్గిపోయాయట! ఉదాహరణకు ఆరునెలలు, మూడేళ్ల మధ్య వయసుగల పిల్లలకు అంగన్ వాడీ కేంద్రాలలో బాలామృతం పంచిపెట్టేవారు! బాలామృతం పేరుతో పౌష్టిక పదార్ధాలున్న పిండిని నెలకు రెండు కిలోల చొప్పున ప్రతి శిశువునకు ఇచ్చేవారట! మూడు నెలలుగా ఈ బాలామృతం పిండి పొట్లాలను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం మానేశారట! ప్రతి శిశువునకు వారానికి రెండు గుడ్లు మాత్రమే ఇస్తున్నారట! అయితే గుడ్లను భారీ ఎత్తున ఈ ప్రభుత్వ కేంద్రాలకు విక్రయిస్తున్న ప్రభుత్వేతర సంస్థలవారి సంక్షేమం కోసం మాత్రమే ఈ కోడిగుడ్లను శిశువులకు పంపిణీ చేస్తున్నారు! వారానికి రెండు చొప్పున నెలకు సరపడా గుడ్లను ఈ ఉత్పత్తిదారులు ఒకేసారి లారీలలో తెచ్చి దించేసిపోతున్నారు! అందువల్ల అంగన్‌వాడీ పంతులమ్మలు నెలకోసారి ఎనిమిది గుడ్లనూ శిశువునకు పంచిపెట్టవలసి వస్తోందట! గ్రామీణ శిశువునకు లభిస్తున్న ప్రభుత్వ సహాయం వారానికి రెండు గుడ్లు...పంచిపెడుతున్న పంతులమ్మలకు శ్రమకు తగిన జీతాలు ఇవ్వకపోవడం అంగన్‌వాడీ భోజన పథకంలోని ప్రధాన ఇతివృత్తం!నిధుల లేవు మరి!

మూడేళ్ల లోపు గ్రామీణ శిశువులకు లభించని భోజనం పాఠశాలలలోని పిల్లలకు మాత్రం ఎందుకు లభించాలన్న తర్కం కేంద్రాన్ని ఆవహించిందా? అందువల్లనే బడి భోజన పథకానికి నిధులను తగ్గిస్తున్నారా? సన్న బియ్యం అన్నం వండి బడిపిల్లలకు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యం కేంద్రం మొండి చూపుతోంది! ఆర్థిక స్థోమత అడుగంటిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దారేది? కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి! బడి భోజనంతో సహా వివిధ పథకాలకు లభించనున్న నిధుల గురించి వివరణతో పత్రాన్ని విడుదల చేయాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: